Punjab Assembly Election 2022:  వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. బిజెపి, ఎస్‌ఎడితో పొత్తు పెట్టుకున్న తమ పార్టీ పుంజుకుంటోందని అమరీందర్ సింగ్   చెప్పారు.  

Punjab Assembly Election 2022:  ఐదు రాష్ట్రాలతో పాటు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిత రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పోల్చితే.. పంజాబ్ రాజకీయాలు కాకలు రేగుతున్నాయి. తాజాగా ఈ ఎన్నిక‌లపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంద‌నీ, ఈసారి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని కెప్టెన్ అమరీందర్ సింగ్ జోస్యం చెప్పారు. పీఎల్‌సీ-బీజేపీ-సాద్ (సంయుక్త్) కూటమి పుంజుకుంటోందని చెప్పారు. పంజాబ్‌లో ప్రస్తుతం చతుర్ముఖ లేదా పంచముఖ పోటీ ఉందని, ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారని అన్నారు.

బహుముఖ పోటీ వల్ల.. ఏ ఒక్క పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాద‌నీ, దీంతో ప‌రిస్థితి క్లిష్టంగా మారుతోంద‌ని అన్నారు. ఒక్కో పార్టీకి 10 నుంచి 15 సీట్లు దాటే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చున‌నీ, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అనుకోవడం లేదనీ అన్నారు. 

ప్రజలు ఆప్ గురించి మాట్లాడుతూ.. రోజురోజుకూ ఆ పార్టీకి ఆదరణ పడిపోతోందనీ, కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతేన‌నీ, భగవంతుని దయవల్ల .. త‌మ కూట‌మి ముందుకు దూసుకు వెళ్తుంద‌ని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. తాను పదవీ విరమణ చేయలేదని, అలసిపోలేదని, పంజాబ్‌ను, దేశాన్ని అభివృద్ధి చేయాలనే తపన తనను ఈ వయస్సులో కొనసాగిస్తోందని పేర్కొన్నాడు.

 పంజాబ్ ఓటర్లలో 30 శాతానికి పైగా ఉన్న దళిత సామాజిక ఓట్లను పొందేందుకు చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రకటించింద‌నీ, ఓట‌ర్లు.. కులానికి లేదా వర్గానికో ప్రాధాన్య‌త ఇస్తూ.. ఓటు వేయకూడదని, అభ్య‌ర్థి సామర్థ్యాన్ని తెలుసుకోని ఓట్లు వేయాల‌ని కెప్టెన్ సింగ్ పేర్కొన్నాడు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా... కులం, వ‌ర్గం ఆధారంగా ఓట్లు వేయ‌డమేమిట‌ని ప్ర‌శ్నించారు. అభ్య‌ర్థి సామర్థ్యం ఆధారంగా ఓటు వేయాలని, చ‌న్నీకి రాబడి కోట్లలో ఉందనీ, కానీ అతను పేదవాడినని చెప్పుకుంటున్నాడని ఆరోపించారు.

బీజేపీతో పొత్తు గురించి పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ మాట్లాడుతూ.. పంజాబ్ అభివృద్ధి, భద్రత కోసం తాను పార్టీతో చేతులు కలిపానని, ముఖ్యమంత్రి అభ్య‌ర్థి విష‌యాన్నిఎన్నికల తర్వాత చ‌ర్చిస్తామ‌ని చెప్పారు. శ‌త్రు దేశ‌మైన‌ పాకిస్థాన్‌తో పంజాబ్ 600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోందని, రాష్ట్ర అభివృద్ధిత‌కి కృషి చేసే.. కొత్త పార్టీ అవసరం ఉందని పేర్కొన్నారు.

పంజాబ్ ఎన్నికలు

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న ..117 నియోజకవర్గాలకు ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10 మార్చి జరుగుతుంది.