సొంత బంధువులే ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు.  అనంతరం  ఆ బాలుడి ముక్కు, చెవులు కత్తిరించేశారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి.. వ్యవసాయ పొలంలో పడేశారు. ఈ సంఘటన రాజస్థాన్  రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నవేలి గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలుడు శనివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే.. బాలుడిని తమకు తెలిసిన కొందరు వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉంటారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆదివారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఓ పంట పొలంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అతని ముక్కు, చెవులు కోసేసి హత్య చేసినట్లు గుర్తించారు.  దర్యాప్తులో భాగంగా బంధువులే బాలుడిని అపహరించి హత్య చేసినట్లు తేలింది. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

కాగా.. డబ్బుల కోసమో.. లేదా క్షుద్ర పూజల నేపథ్యంలో బాలుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాము ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే.. తమ బిడ్డ బ్రతికుండేవాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.