Alternative Dispute Resolution: ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్​కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మీడియేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ఇతరులు ఇప్పుడు కొత్త సాంకేతికతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు 

Alternative Dispute Resolution: మారుతున్న కాలానికి అనుగుణంగా నూత‌న అంశాల‌పై విచారణకు సిద్ధంగా ఉండాలని జడ్జీలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. క్రిప్టోకరెన్సీ, డేటా ప్రొటెక్షన్, ఎన్‌క్రిప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సమస్యలపై రాబోయే రోజుల్లో వ్యాజ్యాలు వ‌స్తాయ‌ని తెలిపారు. నూత‌న సాంకేతిక‌తో తమను తాము పరిచయం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌వి రమణ శనివారం న్యాయవాదులను కోరారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మీడియేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశాలపై రెండు రోజుల పాటు జాతీయ న్యాయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు, కేంద్ర న్యాయశాఖా మంత్రి జస్టిస్ కిరణ్ రిజిజు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ మాట్లాడుతూ... జడ్జీలు, లాయర్లు, న్యాయ నిపుణులు, సంస్థలు కొత్త అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ప్రొటెక్షన్, ఎన్‌క్రిప్షన్ వంటి కొత్త టెక్నాలజీలపై లోతైన అవగాహన పెంచుకోవాల‌ని, సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దేశంలో న్యాయపరమైన ఇబ్బందులు మ‌రిన్ని పుట్టుకొస్తాయని, రానురాను ఈ విష‌యంపై కేసులూ పెరుగుతాయని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అలాగే.. దేశ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ADR) నమూనా భారతదేశ చట్టపరమైన దృశ్యాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ఇతరులు ఇప్పుడు కొత్త సాంకేతికతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

 తప్పుగా అర్థం చేసుకోవడం, అహంకారం, నమ్మకం లేకపోవడం, దురాశ వివాదాలకు దారితీస్తాయి. సరిగా అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. వ్యాజ్యం కంటే ముందుగానే మధ్యవర్తిత్వం, చర్చలు ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడమనేది అత్యంత సాధికార పద్ధతి అని జ‌స్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

ఈ సంద‌ర్బంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ మాట్లాడుతూ.. కొన్ని అడ్డంకుల వల్ల న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వ అంశానికి ఇంకా విస్తృత ఆమోదం లభించలేదని, .మధ్యవర్తిత్వంలో ప్రతి ఒక్కరూ విజేతలే. అయితే, ఇంకా దేశవ్యాప్తంగా విస్తృత ఆమోదం లభించాల్సి ఉందనీ, కొన్ని చోట్ల సుశిక్షితులైన మధ్యవర్తులు ఎక్కువ మంది లేరనీ, చాలా మధ్యవర్తిత్వ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయనీ, వాటిని అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ అడ్డంకులన్నింటినీ తొలగిస్తే ఎక్కువమంది ప్రజలు ప్రయోజనం పొందగలుగుతారు’ అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. వేగంగా న్యాయం అందించేందుకు, కేసుల భారం తగ్గించేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. ఎడిఆర్ అంశంపై కేంద్రం పూర్తి శ్రద్ధ చూపుతోందని, పార్లమెంటు ముందు పెండింగ్‌లో ఉన్న మధ్యవర్తిత్వ బిల్లు రూపాన్ని సంతరించుకుంటోందని తెలియజేశారు. మధ్యవర్తిత్వ బిల్లు 2021 వివాదాల పరిష్కారం కోసం సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని ప్రతిపాదించింది.