ఆల్ట్ న్యూస్ కోఫౌండర్ మొహమ్మద్ జుబేర్ ఎట్టకేలకు 24 రోజుల తర్వాత జైలు నుంచి బయట అడుగుపెట్టారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకు తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.  

న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్ ఎట్టకేలకు 24 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. అభ్యంతరకర ట్వీట్లపై నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయన ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులకు సంబంధించి మొహమ్మద్ జుబేర్‌ను జైలులో ఉంచాలనడానికి సరైన కారణాలు కనిపించడం లేవని, న్యాయమూ అనిపించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 32 కింద అన్ని కేసుల నుంచీ ఆయనను ఈ రోజు సాయంత్రం 6 గంటలకల్లా విడుదల చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ పేపర్ల వర్క్ కారణంగా ఆయన 9 గంటలకు గానీ బయటకు రాలేదు. తిహార్ జైలు నుంచి ఆయన బయటకు వచ్చి ఆయన కోసం ఎదురుచూస్తున్న కారులో వెళ్లిపోయారు.

అరెస్టులు విచక్షణారహితంగా చేయొద్దని, అవసరమైనప్పుడు మాత్రమే పొదుపుగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకే ట్వీట్‌కు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు కావడం.. వేర్వేరు కోర్టులో హాజరు కావడం వంటివి అనవసరం అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఈ కేసుల్లో ఆయనను నిర్బంధంలోనే కొనసాగించడం సరికాదని తెలిపింది.

మొహమ్మద్ జుబేర్‌పై ఉత్తరప్రదేశ్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయనపై నమోదైన అన్ని కేసులనూ ఢిల్లీకి తరలించింది. అంతేకాదు, మొహమ్మద్ జుబేర్ ఇక పై ట్వీట్లు చేయకుండా ఆపాలని యూపీ చేసిన విజ్ఞప్తినీ తోసిపుచ్చింది. 

ట్వీట్లు చేయొద్దని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఆదేశాలు న్యాయవాది ఇక పై వాదించొద్దనేలా ఉంటుందని వివరించింది. జర్నలిస్టును ఇక పై రాయొద్దని ఆదేశించలేం కదా అని తెలిపింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించే వాటికి సమాధానం చెప్పాల్సే ఉంటుందని పేర్కొంది. అంతేకానీ, ఒక పౌరుడిపై ముందుగానే ఎలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రతి పౌరుడు తాను చేసిన పనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉంటాడని వివరించింది. తాము అలాంటి ఆదేశాలు జారీ చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

సుప్రీంకోర్టు ఆయనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయలేదు. కానీ, వాటన్నంటినీ ఒకటిగా చేయడానికి మొహమ్మద్ జుబేర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కలిగి ఉన్నారని తెలిపింది.