ఉత్తరఖాండ్ లో ఇటీవలే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన లీడర్లకు మంగళవారం వివిధ శాఖలు కేటాయించారు. దాదాపు 20కి పైగా శాఖలను సీఎం పుష్కర్ సింగ్ ధామి తన వద్దే ఉంచుకున్నారు. మొత్తంగా ధామి కేబినేట్ లో 8 మందికి మంత్రులుగా అవకాశం లభించింది. 

ఉత్త‌ర‌ఖాండ్ లో రెండో సారి కూడా బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైంది. పుష్క‌ర్ సింగ్ ధామి మ‌రో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇటీవ‌లే సీఎం, మంత్రుల ప్ర‌మాణ స్వీకార వేడుక కూడా జ‌రిగింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు వారం రోజుల తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వంలోని మంత్రులకు వివిధ శాఖల బాధ్యతలు కేటాయించారు. ఈ మంగళవారం రాత్రి పోర్ట్‌ఫోలియోల కేటాయింపుపై ప్రకటన వెలువడింది.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దాదాపు రెండు డజన్ల శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. గృహ, పారిశ్రామిక అభివృద్ధి (మైనింగ్), న్యాయం, కార్మికులు, ఎక్సైజ్, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ, పునరావాసం, పౌర విమానయానం వంటివి ఇందులో ఉన్నాయి. మంత్రి సత్పాల్ మహరాజ్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్, గ్రామీణ నిర్మాణం, సంస్కృతి, పర్యాటకం, నీటి వనరుల నిర్వహణ, నీటిపారుదల, మైనర్ ఇరిగేషన్ సహా 10 పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. ఆర్థిక, పట్టణాభివృద్ధి, శాసనసభ, పార్లమెంటరీ వ్యవహారాలు, పునర్వ్యవస్థీకరణ, జనాభా లెక్కలు ప్రేమ్ చంద్ అగర్వాల్‌కు వెళ్లాయి.

తొలిసారిగా మంత్రి అయిన చందన్ రామ్ దాస్‌కు సాంఘిక సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, రోడ్డు రవాణా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు. ధామి మంత్రివర్గంలో మరో కొత్త వ్య‌క్తి అయిన సౌరభ్ బహుగుణకు పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, చెరకు అభివృద్ధి, చక్కెర పరిశ్రమ, ప్రోటోకాల్, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శాఖల‌ను కేటాయించారు. 

మంత్రి గణేష్ జోషి వ్యవసాయం, రైతుల సంక్షేమం, సైనిక్ కళ్యాణ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్ప‌గించారు. ధన్ సింగ్ రావత్ కు పాఠశాల విద్య, ప్రాథమిక, మాధ్యమిక అలాగే సంస్కృత విద్య, సహకార, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, వైద్య విద్యకు ఆయ‌న బాధ్యత వహిస్తారు. సుబోధ్ ఉనియాల్ అటవీ, భాష, ఎన్నికలు, సాంకేతిక విద్య మంత్రిగా ప‌ని చేయ‌నున్నారు. 

రేఖ ఆర్యకు మహిళా సాధికారత, శిశు అభివృద్ధి, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, క్రీడలు, యువజన సంక్షేమ శాఖలు అప్ప‌గించారు. కాగా పుష్క‌ర్ సింగ్ ధామి మంత్రి వ‌ర్గం మార్చి 23న ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ధామి ఉత్తరాఖండ్‌లోని ఖతిమా నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అయినా బీజేపీ హైక‌మాండ్ ఆయ‌న‌కు మ‌రో సారి సీఎంగా అవ‌కాశం ఇచ్చింది. ఈ నెల 21వ తేదీన శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌గా అక్క‌డి ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను ఎన్నుకున్నారు. కాగా, 2025 నాటికి ఉత్తరాఖండ్‌ను దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్ర‌మాణ స్వీకారం రోజు పుష్క‌ర్ సింగ్ ధామి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలు, తీర్మానాలను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తామ‌ని తెలిపారు.

70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) 47 స్థానాల్లో అధిక్యంలో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితం కాగా.. బీఎస్పీ రెండు స్థానాలు గెలుచుకుంది. మరో 2 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.