చత్తీస్ గఢ్ లో ఓ వింత ఘటన జరిగింది. ఆక్రమంగా ఓ స్థలంలో శివాలయం నిర్మించారన్న ఆరోపణలతో శివుడి విగ్రహానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. దీంతో శివలింగాన్ని కోర్టుకు తీసుకువచ్చారు భక్తులు. 

చత్తీస్ గఢ్ : అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ప్రధాన తారగణంగా 2012లో వచ్చిన ‘ఓ మైగాడ్’ సినిమా గుర్తుందా? దేవుళ్ల పేరుతో చేసే దందాలు, మోసాల మీద సూపర్ సెటైరికల్ సినిమా. దీన్ని ఆ తరువాత వెంకటేష్, పవన్ కల్యాణ్ లను పెట్టి తెలుగులో.. ‘గోపాలా.. గోపాలా..’ అని తీసిన సంగతి తెలిసిందే. దేవుడు, దేవుడి చుట్టూ అల్లుకున్న నమ్మకాలు, వాటితో జరిగే వ్యాపారం.. దాని వెనకుండే మోసాలు.. ఈ నేపథ్యంలో సామాన్యుడు పడే అగచాట్లు.. అధికారుల అండదండలు.. ఇలా ఫేక్ బాబాల మోసాలకు బలయ్యే దేవుడిని.. ఆ లీలల్ని కళ్లకు కట్టినట్టు.. ఆలోచింపచేసేలా తెరకెక్కించారు. సరేగానీ.. ఇప్పుడీ విషయం ఎందుకంటారా? సరిగ్గా ఇలాంటి సీనే ఒకటి తాజాగా చత్తీస్ గఢ్ లో జరిగింది. 

భూఆక్రమణల కేసులో ఆ స్థలంలో ఉన్న దేవాలయంలోని శివుడి విగ్రహానికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వాధికారులు. దీంతో ఎవరికి వెంకటేషఓ, పరేష్ రావెలో పూనినట్టున్నాడు. ఏకంగా శివలింగాన్ని పెకిలించి.. రిక్షాలో పెట్టుకుని మరీ కోర్టుకు తీసుకువచ్చారు. అసలు విషయంలోకి వెడితే... 

భూఆక్రమణ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు తాకీదులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఏకంగా ఆ మహాశివుడే స్వయంగా విచారణకు హాజరయ్యాడు. ఈ సంఘటన చత్తీస్ ఘడ్ లోని రాయగఢ్ లో జరిగింది. శివుడితో పాటు నోటీసులు అందుకున్న మరో 9 మంది విచారణకు హాజరయ్యారు. తమతో పాటు గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టులో తీసుకొచ్చారు. రాయ్ గఢ్ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్ పుర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 

ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహసీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ అనంతరం 10మందికి నోటీసులిచ్చారు. ఈ నెల 25న జరిగే విచారణకు వచ్చి.. భూకబ్జా ఆరోపణలమీద వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు (భూమిని ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా) తప్పవని హెచ్చరించారు. దీంతో శివలింగంతో సహా నోటీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరయ్యారు. 

Scroll to load tweet…