పరస్పర అంగీకారంతో తాము వివాహం చేసుకున్నామని.. తమ వివాహాన్ని గుర్తించాలని ఇద్దరు యువతులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హిందూ వివాహ చట్టంలో ఇద్దరు వ్యక్తుల వివాహాల గురించి మాట్లాడుతున్నారని.. స్వలింగ సంపర్క వివాహాన్ని చట్టం వ్యతిరేకించలేదని యువతులు వాదించారు.

తమ పెళ్లిని గుర్తించాలని ఇద్దరు యువతులు చేసిన అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాలను వ్యతిరేకించడం లేదని వారు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరో యువతి బారి నుంచి తన కుమార్తెను విడిపించాలని ఓ తల్లి హెబియస్‌ కార్పస్‌ కింద కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు.. అంజుదేవి అనే మహిళ 23 ఏళ్ల తన కూతురును.. 22 ఏళ్ల మరో యువతి అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించింది. మరో బాలిక బారి నుంచి తన కుమార్తెను విడిపించాలంటూ తల్లి హెబియస్‌ కార్పస్‌ కింద పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఏప్రిల్ 6వ తేదీన విచారణ చేపట్టిన హైకోర్టు.. మరుసటి రోజు విచారణలో ఇద్దరు యువతులు కోర్టుకు హాజరు అయ్యే చూడాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.ఈ క్రమంలోనే ఏప్రిల్ 7వ తేదీన ఇద్దరు యువతులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ సమక్షంలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. పరస్పర అంగీకారంతో తాము వివాహం చేసుకున్నామని.. తమ వివాహాన్ని గుర్తించాలని ఇద్దరు యువతులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హిందూ వివాహ చట్టంలో ఇద్దరు వ్యక్తుల వివాహాల గురించి మాట్లాడుతున్నారని.. స్వలింగ సంపర్క వివాహాన్ని చట్టం వ్యతిరేకించలేదని యువతులు వాదించారు.

ఇద్దరు యువతులు చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. స్వలింగ వివాహం భారతీయ సంస్కృతి, భారతీయ మతాలకు విరుద్ధమని.. భారతీయ చట్టాల ప్రకారం చెల్లదని అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతిలో స్వలింగ వివాహాలకు అనుమతి లేదని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి ఏ చట్టంలోనూ గుర్తింపు లేదని చెప్పారు.

హిందూ సంస్కృతిలో పెళ్లి అంటే పవిత్రమైన సంస్కారమని, ఓ పురుషుడు, ఓ స్త్రీ పెళ్లి చేసుకోవచ్చునని చెప్పారు. మన దేశం భారతీయ సంస్కృతి, మతాలు, చట్టాల ప్రకారం నడుస్తోందన్నారు. పెళ్లిని ఓ పవిత్రమైన సంస్కారంగా పరిగణిస్తామని తెలిపారు. ఇతర దేశాల్లో పెళ్లి అంటే ఓ కాంట్రాక్టు అని తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువతులు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంజు దేవి వేసిన హెబియస్​ కార్పస్​ పిటిషన్​ను కూడా కొట్టివేసింది.