దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్టుగా తయారైంది ఆ ఖైదీ పరిస్థితి. కోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు ఒప్పు కోలేదు. దీంతో బయిల్ వచ్చినా ఎనిమిదినెలల పాటు జైల్లోనే మగ్గాడు. చివరికి హైకోర్టు జోక్యంతో బెయిల్ లభించింది.

వివరాల్లోకి వెడితే... ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్ జిల్లా జైల్లో ఈ ఘటన వినోద్ కుమార్ బరువార్ అనే వ్యక్తి 2019 సెప్టెంబర్ 4న బెయిల్ కోసం సిద్ధార్థ నగర్ సెసష్స్ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ టైంలో  అతడి అభ్యర్థనను న్యాయమూర్తులు తిరస్కరించారు. 
ఆ తరువాత అతడి అల్లాహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ వినోద్ కు ఊరట లభించింది. వినోద్‌ను విడుదల చేయాలంటూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..రెండు న్యాయస్థానాల్లోనూ వినోద్ చేసుకున్న దరఖాస్తుల్లో అతడి పేరు వినోద్ బరువార్‌గా నమోదైంది. కానీ జైలు అధికారుల రికార్డుల్లో మాత్రం వినోద్ కుమార్ బరువార్ అని పూర్తి పేరు ఉంది. 

ఈ కారణంగా వినోద్‌ను విడుదల చేసేందుకు జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు. దీంతో,.బాధితుడు ఇటీవల మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ దరఖాస్తుల్లో పేరు మార్చి తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని న్యాయమూర్తులను వేడుకున్నాడు. అతడి అవస్థ విషయం తెలిసి న్యాయస్థానం జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పేరులో తేడా కారణంగానే తాము విడుదల చేయలేకపోయామన్న జైలు అధికారుల వాదనను తోసిపుచ్చింది. ఖైదీ పేరులో ఒక పదం లేనంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏమిటి..? అతడి గుర్తింపుకు సంబంధించి ఇది పెద్ద అనుమానాలకు తావియ్యలేదు కదా..? అని కోర్టు జైలు అధికారులను ప్రశ్నించింది. 

ఇటువంటి సాంకేతిక కారణాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలంటూ జైలు సూపరింటెండెంట్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో, జైలు అధికారులు వినోద్‌ను తక్షణం విడుదల చేశారు.