తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కాంగ్రెస్-డీఎంకే కూటమిపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాం మొత్తం కుంభకోణాలతో నిండిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో 2జీ, 3జీ, 4జీలకు అమిత్ షా కొత్త అర్థాలు చెప్పారు. కాంగ్రెస్- డీఎంకే కూటమి 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందంటూ కేంద్ర హోంమంత్రి 2జీ, 3జీ, 4జీల ప్రస్తావన చేశారు.

2జీ అంటే మారన్‌ కుటుంబంలోని రెండు తరాలని, 3జీ అంటే కరుణానిధికి సంబంధించిన మూడు తరాలని, 4జీ అంటే నెహ్రూ- గాంధీ కుటుంబంలోని నాలుగు తరాలంటూ అమిత్ షా సెటైర్లు వేశారు.

ఓ పక్క పేద ప్రజల సంక్షేమం కోసం అన్నాడిఎంకే, బీజేపీ కూటమి తాపత్రాయపడుతుంటే రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా, ఉదయనిధిని సీఎం చేయాలనేది స్టాలిన్ ఆందోళన పడుతున్నారని చురకలు వేశారు. కాగా..  తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే రెండున ఫలితాలు వెలువడనున్నాయి.