కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు అందరూ రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాయంలో ఈ కార్యక్రమం జరిగింది. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు అందరూ రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. దీంతో మల్లికార్జున ఖర్గే.. కొత్త టీమ్‌ను ప్రకటించనున్నారు. ఇక, 12 మంది సభ్యులను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలు జరగనున్నాయి.
‘‘సీడబ్లూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్‌లందరూ వారి రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించారు’’ అని సీనియర్ నేత వేణుగోపాల్ వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖర్గే తన తొలి ప్రసంగంలో.. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని సంఘ్ రాజ్యాంగంతో భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కానీ కాంగ్రెస్ దానిని జరగనివ్వదని అన్నారు. నవ భారతంలో ఉద్యోగాలు లేవని, పేదరికం పెరిగిపోయిందని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయడమే ప్రస్తుత ప్రభుత్వ ప్రయత్నమని ఆరోపించారు. అయితే ప్రజల కోసం ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీ పదవులను భర్తీ చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక దృష్టి సారించే సామాజిక సలహా కమిటీ ఉంటుందని చెప్పారు. 1969లో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని చెప్పారు.పార్టీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
