బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై  కాంగ్రెస్, జేడీ(ఎస్)లు  సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర నివాసంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు,. సీనియర్లు సోమవారం నాడు సమావేశమయ్యారు.

  కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్  పార్టీకి చెందిన 22 మంది జేడీ(ఎస్)కు చెందిన 10 మంది మంత్రులు ఉన్నారు. బెంగుళూరులో సుమారు 13 మంది కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలను  బుజ్జగించేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు  తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు.

అసంతృప్తులకు మంత్రి పదవులు ఇవ్వాలని  సంకీర్ణ కూటమిలోని  రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. డిప్యూటీ సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్లు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు పార్టీల నేతలు రెండు రోజులుగా  ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న 32 మంది మంత్రులు రాజీనామా లేఖలను  సమర్పించనున్నారు. వీరి స్థానంలో  కొత్త వారిని  తీసుకోవాలని కుమారస్వామి భావిస్తున్నారు.ఈ మేరకు సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వరలు ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారు.

ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి డికె శివకుమార్ ఈ సంక్షోభం నుండి బయటపడతామని ఆయన అభిప్రాయపడ్డారు.మరో వైపు తమ పార్టీకి చెందిన మంత్రులంతా రాజీనామా చేస్తారని కాంగ్రెస్ ఎంపీ సురేష్ తేల్చి చెప్పారు.

మరో వైపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ తన మంత్రిపదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వానికి కూడ మద్దతును ఉపసంహరించుకొన్నట్టుగా గవర్నర్‌కు లేఖ సమర్పించారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని బీజేపీ ఆరోపించింది. మైనార్టీలో ప్రభుత్వం పడినందున కుమారస్వామి రాజీనామా చేయాలని  బీజేపీ డిమాండ్ చేస్తోంది.