కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా రైతుల ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని సుప్రీం నియమించింది.

రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), అశోక్‌ గులాటీ(వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్‌ ఘావంత్‌(షెట్కారీ సంఘటన) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది.

Also Read:నూతన వ్యవసాయ చట్టాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అయితే వీరంతా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు మద్ధతుదారులేనంటూ రైతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు ద్వారా ఈ కమిటీని నియమించేందుకు ప్రయత్నించిందని రైతు సంఘాల నేతలు ఎద్దేవా చేశారు. 

కాగా, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇరు వర్గాల మధ్య చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని వ్యాఖ్యానించింది. అవసరమైతే ఈ చట్టాల అమలుపై స్టే విధిస్తామన్న న్యాయస్థానం.. మంగళవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.