చెన్నై: వార్నింగ్ ఇచ్చారు అయినా మార్పు లేదు....తిరుగుబాటు చేస్తానని హెచ్చరించారు చలనం లేదు. శాంతి ర్యాలీ పేరుతో బలప్రదర్శనకు దిగారు పట్టించుకోలేదు...నీ నాయకత్వాన్ని అంగీకరిస్తా అంటూ సయోధ్యకు వెళ్లాడు దరి చేరనివ్వలేదు....పార్టీ కష్టాల్లో ఉంది తనను తీసుకుంటే బాగుంటుందని పార్టీ శ్రేయస్సుడిగా అడిగారు అయినా స్పందించలేదు..ఇది ఎవరి మధ్యో అనుకుంటే పొరపాటే. 

సొంత అన్నదమ్ముల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం. అన్న ఏం చేసినా తమ్ముడు మెట్టు కూడా దిగిరావడం లేదు. తమ్ముడు ఎంతకీ తనను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏం చెయ్యాలో అన్న ఆలోచనలో పడ్డారు అన్న. ఇది తమిళనాడు డీఎంకే పార్టీలో అన్నదమ్ములు అళగిరి స్టాలిన్ ల మధ్య నెల రోజులకు పైగా జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలు.  

డీఎంకే పార్టీలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న రాజకీయ దుమారం ఓ కొలిక్కి రావడం లేదు. డీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కరుణానిధి మరణంతో డీఎంకే పీఠంపై అన్నదమ్ముల మధ్య పోరు నడిచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న స్టాలిన్ నూతన అధ్యక్షుడు అంటూ ప్రచారం జరిగింది. ఇక పట్టాభిషేకమే తరువాయి అనుకున్న క్షణంలో రేసులో తానున్నానంటూ కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి రంగ ప్రవేశం చేశారు. 

నిజమైన కార్యకర్తలంతా తనవైపే ఉన్నారంటూ ప్రచారం చేసుకున్నారు అళగిరి. తాను అధ్యక్ష పీఠం రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. తనకంటూ ఓ వర్గాన్ని సృష్టించారు. తీరా నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే సందర్భంలో స్టాలిన్ తనకు సోదరి మాత్రమే ఉందని సోదరుడు లేరంటూ చేసిన వ్యాఖ్యలతో కంగుతిన్న అళగిరి కాస్త మెత్తబడ్డారు.

తమ్ముడి నాయకత్వాన్ని అంగీకరిస్తానంటూ రాయబారం పంపించారు. కానీ తమ్ముడు మాత్రం కరగలేదు. పార్టీలోకి తనను తీసుకోవాలని సయోధ్యకు ప్రయత్నించారు అయినా స్టాలిన్ లో మార్పలేదు. చెన్నై మహానగరంలో ఈనెల 5న శాంతి ర్యాలీ చేపట్టారు. శాంతి ర్యాలీలో తన బలప్రదర్శన చూపించినా స్టాలిన్ లో ఉలుకులేదు పలుకు లేదు. పార్టీ కష్టాల్లో ఉంది తనను తీసుకోవాలని తమ్ముడికి మెురపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. 

తమ్ముడు స్టాలిన్ తో సయోధ్యకు ఎంత ప్రయత్నించిన స్పందించకపోవడంతో ఎంకే అళగిరి ఏం చెయ్యబోతున్నారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన రాజకీయ భవిష్యత్ పై  ఎలాంటి వ్యూహాలు రచిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. డీఎంకే పార్టీలోకి తిరిగి రావడానికి విశ్వప్రయత్నాలు చేసినా పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అళగిరి భవిష్యత్ రాజకీయాలపై ఆలోచనలో పడ్డారు.  

ప్రస్తుతం అళగిరి, స్టాలిన్‌ మధ్య నెలకొన్న వివాదాలు మళ్లీ వారసుల మధ్య భవిష్యత్ లో పునరావృతం కాకూడదని ఉద్దేశంతో కరుణ కుటుంబం ఉందట. దయానిధి, ఉదయనిధిల మధ్య ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అందులో భాగంగానే స్టాలిన్ మౌనంగా ఉంటున్నారని సమాచారం.  

కరుణానిధి మరణించిన తర్వాత అళగిరిని పార్టీలో చేర్చుకునే అంశంపై పెద్ద ఎత్తున చర్చజరిగింది. అయితే అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రయత్నాలు కాస్త బెడిసికొట్టాయి. తొలి నుంచి స్టాలిన్ తన సోదరుడు అళగిరి వ్యవహారాన్ని అంతగా సీరియస్ గా పరిగణించడం లేదు. శాంతిర్యాలీ ద్వారా తన బలాన్ని చాటాలని, తద్వారా పార్టీలోకి రావాలనుకున్న అళగిరి అందుకు తగ్గ ప్రణాళిక వేసుకున్నా అది కూడా విజయవంతం కాలేదు. 

దీంతో అళగిరి వర్గం డీలా పడింది. దక్షిణాది జిల్లాల్లో అళగిరికి మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీలో ఉంటే మంచిదని భావిస్తున్నారు. ఒక వేళ ర్యాలీ విజయవంతం అయితే అళగిరిని పార్టీలోకి తీసుకునేవారని కొందరు డీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. అళగిరిని ఇప్పుడు పార్టీలో తీసుకునే అవకాశం లేదని కరుణానిధి బ్రతికి ఉన్నప్పుడే రావాల్సిందని కొందరు స్పష్టం చేస్తున్నారు.

స్టాలిన్ కరుణించకపోవడంత దక్షిణాదిలో పట్టున్న అళగిరి ఇక ఉపఎన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీ అవుతున్నారు. డీఎంకే పార్టీలో ఉన్నప్పుడు అళగిరి దక్షిణాది జిల్లాలో మంచి పట్టు సాధించారు. అయితే ఇదే దక్షిణాది ప్రాంతంలో తిరుపరకుండ్రం, తిరువారూర్ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఉపఎన్నికలు వస్తే అళగిరి మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలో అప్పుడైనా డీఎంకే తనను పార్టీలోకి తీసుకుంటుందని అళగిరి భావిస్తున్నారు. అళగిరి మద్దతు డీఎంకే తీసుకోకపోతే అన్నాడీఎంకేకు కంచుకోటైన తిరుపరకుండ్రం నియోజకవర్గాన్ని టీటీవీ దినకరన్‌ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తిరువారూర్‌లో కూడా డీఎంకే ఓట్లు చీలితే అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 

ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ అళగిరి విషయంలో మాత్రం ఇప్పటి వరకు డీఎంకే నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పైగా అళగిరిని పార్టీలోకి తీసుకోవడం ఉండదన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. అదే జరిగితే ఉప ఎన్నికల్లో సత్తాచాటాలని అళగిరి చూసే అవకాశం ఉంది.  దానిద్వారా మరోసారి తన బలాన్ని పార్టీకి తెలియజేయాలని భావించే పరిస్థితి ఏర్పడనుంది.
 
ఇకపోతే ఫైనల్ గా తనను డీఎంకేలోకి తీసుకోకపోతే తన అభిమాన నటుడు, సన్నిహితుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీలో చేరడమా లేదా బీజేపీలో చేరడమా అన్న ఆలోచనలో ఉన్నారు అళగిరి. అలా కాకుంటే సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా అళగిరి ఉన్నట్లు సమాచారం. అయితే ఉపఎన్నికల వరకు వేచి చూడాలని అప్పుడు కూడా డీఎంకే పార్టీ నుంచి ఆహ్వానం రాకపోతే అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతారట అళగిరి.