అసెంబ్లీ ఎన్నికలు ముందున్న వేళ తమిళనాడు రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. సినిమాస్టార్ల కొత్త పార్టీలు, పొత్తులతో ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా కరుణానిధి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కొత్త పార్టీ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే తాను రజనీని కలుస్తానని.. ఆ తరువాత పార్టీపై నిర్ణయం తీసుకుంటానని గురవారం అళగిరి ప్రకటించారు.

చెన్నై గోపాలపురం నివాసగృహంలో ఉన్న తన తల్లి దయాళు అమ్మాళ్‌ను పరామర్శించేందుకు గురువారం ఉదయం అళగిరి చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన స్నేహితుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చెన్నై వచ్చిన వెంటనే తప్పకుండా కలుస్తానని, ఇక కొత్త పార్టీని ప్రారంభంపై జనవరి 3వ తేదీ తన మద్దతుదారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని కరుణానిధి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి ప్రకటించారు. 

కరుణానిధి హాయంలో అళగిరి డీఎంకే దక్షిణ మండల పార్టీ ఇన్‌చార్జిగా ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆ తర్వాత పార్టీలో చక్రం తిప్పుతున్న సోదరుడు స్టాలిన్‌తో ఆయనకు మనస్పర్థలు తలెత్తాయి. పార్టీ అధిష్ఠానంపై విమర్శలు చేయడంతో కరుణానిధి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 

కరుణానిధి మృతి తరువాత అళగిరి త్వరలో మద్దతుదారులతో కలిసి రాజకీయ పార్టీ ప్రారంభిస్తానంటూ తరచూ చెబుతుండేవారు. అళగిరి పార్టీని ప్రారంభించి తన చిరకాల స్నేహితుడు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పొత్తుపెట్టుకుంటారని కూడా ఊహాగానాలు కూడా చెలరేగాయి.

ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెన్నైలో పర్యటించినప్పుడు ఆయన సమక్షంలో అళగిరి బీజేపీలో చేరనున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. వాటిని అళగిరి ఖండించారు. తరువాత అళగరి మదురైలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రధాన పాత్ర పోషిస్తానని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో గురువారం అళగిరి చెన్నై గోపాలపురంలో ఉన్న దయాళు అమ్మాళ్‌ను పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై డీఎంకేలో చేరి పార్టీకి సేవలందించే ఆస్కారమే లేదని  స్పష్టం చేశారు.