డీఎంకే మాజీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి.. మరో మాష్టర్ ప్లాన్ వేశారు. సొంత పార్టీపై ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఇటీవల స్టాలిన్ డీఎంకే అధినేతగా ఎన్నికైన తర్వాత నుంచి మళ్లీ పార్టీలో చోటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆళగిరి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన మరో మాష్టర్ ప్లాన్ వేశారు.

స్టాలిన్‌ మెట్టు దిగకుంటే త్వరలో రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో డీఎంకేకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిసింది. తండ్రి మృతితో ఖాళీ అయిన తిరువారూర్‌ నియోకవర్గంలో తానే రంగంలోకి దిగాలని, కరుణానిధి కొడుకుగా ప్రజల ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 5న భారీ స్థాయిలో కరుణానిధి సమాధి వద్దకు ర్యాలీ నిర్వహించి తన సత్తా చాటినప్పటికీ స్టాలిన్‌ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో స్టాలిన్‌ను మెట్టు దించడానికి అళగిరి మరో ఎత్తుగడకు సిద్ధమయ్యారు. బోస్‌ మృతితో ఖాళీ అయిన తిరుప్పరకుండ్రం, కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువారూర్‌ శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి డీఎంకేకు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో తిరువారూర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయనే రంగంలోకి దిగాలని నిర్ణయించారని, దీనిపై తన మద్దతుదారులతో సమాలోచనలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

తిరువారూర్‌ నియోజకవర్గంలో డీఎంకే కన్నా కరుణానిధి కుటుంబానికి వచ్చే ఓట్లే కీలకం. ఉదయ సూర్యుడు గుర్తు కన్నా కరుణానిధి ముఖచిత్రం కోసమే ఓట్లు వేసేవారు ఎక్కువ మంది ఉండటంతో ఇక్కడ తనకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని అళగిరి భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే కరుణానిధి కుమారుడు అనే సానుభూతితో డీఎంకే అభ్యర్థిని ఓడించవచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం తిరువారూర్‌ ఓటర్ల మధ్యకు ‘కరుణానిధి కుమారుడిని నేను, డీఎంకే కార్యకర్తల అభ్యర్థిని నేను’ అనే నినాదంతో సైతం వెళ్లడానికి అప్పుడే రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

 అదేవిధంగా తిరుప్పరకుండ్రం ఉప ఎన్నికల్లోనూ డీఎంకే అభ్యర్థికి వ్యతిరేకంగా తన తరఫున బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో పనిచేయడానికి బూత్‌ స్థాయి కమిటీలను త్వరలో ఏర్పాటు చేసే పనిలో అళగిరి ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాల సమాచారం.