తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ స్థాపించగా, సూపర్ స్టార్ రజీనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 31న తన పార్టీ గురించి అనౌన్స్ చేస్తనని రజనీకాంత్ చెప్పడంతో ఆ ఉత్కంఠకు తెరపడింది.

ఆ తరువాత మరో హీరో విజయ్ కూడా పార్టీ  పెట్టబోతున్నాడన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఆయన తన అభిమానుల కల నెరవేరుతుందన్ని పార్టీ విషయంలో హింట్ కూడా ఇచ్చాడు. 

ఇప్పుడు మరో కొత్త ఉత్కంఠకు తెరలేపారు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు అళగిరి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకూ ఇలాంటా వార్తలతో తమిళ రాజకీయం వేడెక్కుతుంది. 

అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న తన తల్లి దయాళు అమ్మాళ్‌ను పరామర్శించడానికి ఆయన గోపాలపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘జనవరి 3న నా అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వమిస్తున్నా. కొత్త పార్టీ స్థాపనపై ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటా. ఒకవేళ నా కార్యకర్తలు కొత్త పార్టీ పెట్టాలని సూచిస్తే... కొత్త పార్టీని స్థాపిస్తా. అంతేగానీ... డీఎంకేకు మాత్రం మద్దతివ్వను.’’ అని అళగిరి కుండబద్దలు కొట్టారు. 

డీఎంకేలోకి తిరిగి రమ్మని ఆహ్వానం అందిందా? అని అడగ్గా... ఇప్పటి వరకూ అలాంటి ఆహ్వానమేదీ రాలేదని తెలిపారు. హైదరాబాద్ షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను రజనీకాంత్‌ను కలుసుకుంటానని అళగిరి వెల్లడించారు.