చెన్నై:డీఎంకె చీఫ్ కరుణానిధి మరణించిన తర్వాత డీఎంకె లో వారసత్వ పోరు కొనసాగే  సూచనలు కన్పిస్తున్నాయి. డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం స్టాలిన్ కొనసాగుతున్నారు.  అయితే  పార్టీ క్యాడర్ అంతా తన వెంటే ఉందని  డీఎంకె నుండి బహిష్కరణకు గురైన కరుణానిధి తనయుడు  ఆళగిరి  ప్రకటించడం సంచలనంగా మారింది. 

తన వారసుడిగా స్టాలిన్‌ను కరుణానిధి బతికున్న సమయలోనే ప్రకటించారు. గత ఏడాది  కరుణానిధి అనారోగ్య కారణాలతో  డీఎంకెకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కరుణానిధిని నియమించారు.  అయితే  ఆ సమయం నుండి ఆళగిరి  పార్టీ కార్యక్రమాలకు ఇంకా దూరమయ్యారు. 

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంగా 2014లో డిఎంకె నుండి ఆళగిరిని  కరుణానిధి సస్పెండ్ చేశారు. అయితే కరుణానిధి మరణించినందున  ఆళగిరిని పార్టీలోకి తీసుకోవాలని కరుణానిధి కుటుంబసభ్యులు  స్టాలిన్‌ను డిమాండ్ చేస్తున్నారు.  ఈ తరుణంలో స్టాలిన్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ఆసక్తికరంగా మారింది. 

కరుణానిధి సమాధి వద్ద  నిజమైన  పార్టీ క్యాడర్‌ అంతా తనవైపే ఉందని  ఆళగిరి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలకు అద్దం పడుతున్నాయి. 2016 ఎన్నికల్లో డీఎంకె అధికారానికి దూరం కావడానికి ఆళగిరి పార్టీకి దూరం కావడం కూడ కారణంగా డీఎంకె వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

పార్టీలోకి ఆళగిరిని తిరిగి చేర్చుకొనే విషయమై స్టాలిన్ పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేత. పార్టీ ప్రధాన కార్యదర్శి  అన్భళగన్‌ స్టాలిన్‌ను కలిశారు. పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.  ఆళగిరి విషయమై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.  అయితే భవిష్యత్తులో పార్టీ బలోపేతం చేసే విషయమై  చర్చించారని సమాచారం.

పార్టీలో కీలకపదవిని  ఆళగిరి కోరుకొంటున్నారు.  ఈ మేరకు తన సన్నిహితుల వద్ద  ఆళగిరి ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు డీఎంకెలో ప్రచారం సాగుతోంది. గతంలో తాను నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ ఆర్గనైజింగ్ పోస్టు  కోసం  ఆళగిరి ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టు తెలుసత్తోంది.అయితే  ఈ పదవిని ఇచ్చేందుకు ఆళగిరి  సానుకూలంగా ఉన్నారని కూడ  సమాచారం.

పార్టీలోకి ఆళగిరి రాకను పలువురు  సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఆళగిరి పార్టీలోకి వస్తే  తమ పరిస్థితి ఏమిటనే విషయమై  స్టాలిన్ మద్దతుదారుల్లో ఆందోళన కూడ నెలకొంది. డీఎంకె చీఫ్ కరుణానిధికి నివాళులర్పించేందుకు  వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  ఆళగిరితో అరగంటకు పాటు సమావేశం కావడం  రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఆళగిరికి డీఎంకెలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంటుందా  అనే అనుమానాలు కూడ లేకపోలేదు. గత ఏడాదిలో జరిగిన  ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో  డీఎంకెకు డిపాజిట్ కూడ రాకపోవడంపై ఆళగిరి అప్పట్లో నిప్పులు చెరిగారు. స్టాలిన్ నాయకత్వంలో  డీఎంకె ఒక్క ఎన్నికల్లో కూడ విజయం సాధించదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాల నేపథ్యంలో  డీఎంకె  అత్యవసర సమావేశాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఏర్పాటు చేశారు.  ఈ సమావేశంలో  భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.  ఈ సమావేశంలో  ఆళగిరిని పార్టీలోకి తీసుకొనే విషయమై చర్చించే అవకాశాలు ఉన్నాయి.  ఈ సమావేశంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకొంటారనే విషయమై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.