గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్ అల్ ఖైదా జమ్ము కశ్మీర్‌పై ఓ వీడియో విడుదల చేసింది. జమ్ము కశ్మీర్‌క ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ తొలగింపును ముస్లింలకు చెంపపెట్టుగా పేర్కొంది. అంతేకాదు, జమ్ము కశ్మీర్‌ను పాలస్తీనాతో పోల్చింది. జమ్ము కశ్మీర్ ప్రజలు ఆయుధాలు చేతపట్టుకోవాలని రెచ్చగొట్టింది.

న్యూఢిల్లీ: మన దేశంలో జమ్ము కశ్మీర్ చాలా సెన్సిటివ్. మెజార్టీ హిందు దేశంలో మెజార్టీ ముస్లిం రాష్ట్రంగా జమ్ము కశ్మీర్ 2019 వరకు ఉండింది. భారత్‌తో పాక్ వైరానికి కేంద్రబిందువుగా ఇది ఉన్నది. ఉగ్రవాదాన్ని జమ్ము కశ్మీర్‌లోకి పంపి చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ జమ్ము కశ్మీర్‌పై ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మరో వీడియో ప్రకటన విడుదల చేసింది. భారత్‌లోని ముస్లింలను రెచ్చగట్టేలా ఆ వీడియో ఉన్నది. ఇందులో ఆర్టికల్ 370 తొలగింపు ముస్లింలకు చెంప పెట్టువంటిదని ఈ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. 

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న తొలగించింది. ఈ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌పై అల్ ఖైదా చీఫ్ అయ్మాన్ అల్ జవహిరి మాట్లాడారు. పాలస్తీనాతో జమ్ము కశ్మీర్‌కు పోలిక తీశారు. పాలస్తీనాతో ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని పోల్చారు. అల్ ఖైదా మీడియా వింగ్ అస్ సహబ్ విడుదల చేసింది.

ఆ వీడియోలో కొన్ని దృశ్యాలు జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టగా అప్పుడు చోటుచేసుకున్న హింసకు సంబంధించినవి ఉన్నాయి. అంతేకాదు, భారత్‌లో హిజాబ్ నిరసనలకు సంబంధించిన ఫుటేజీ కూడా ఆ వీడియోలో ఉన్నది. భారత్‌కు ఇజ్రాయెల్‌ల మధ్యలో సారూప్యతలు ఉన్నాయని అల్ ఖైదా చీఫ్ జవహిరి పేర్కొన్నాడు. అంతేకాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శత్రువుగా ప్రకటించారు. జమ్ము కశ్మీర్ యుద్ధాన్ని ముస్లింల యుద్ధంగా జీహాద్‌గా అభివర్ణించాడు. కశ్మీర్ ప్రజలు ఆయుధాలు చేతపట్టాలని పేర్కొంటూ ఒకరకమైన హింసకు ఆయన ప్రేరేపిస్తున్నట్టు స్పష్టంగా ఆ వీడియోలో కనిపించినట్టు కథనాలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా, జమ్ము కశ్మీర్‌లో ఈ రోజు ఓ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌లో ఈ రోజు ఎన్‌కౌంటర్ జరిగింది. వచ్చే నెలాఖరు నుంచి ఇదే పహల్‌గామ్ గుండా అమర్‌నాథ్ యాత్ర జరగనుంది. దక్షిణ కశ్మీర్‌లో పహల్‌గామ్‌ లో టూరిస్టు రిసార్ట్ ఈ యాత్రికుల కోసం బేస్ క్యాంప్‌గా పని చేస్తుంది. అటువంటి ఈ పహల్‌గామ్‌లోనే భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. తద్వార యాత్ర సమయంలో టెర్రరిస్టులు వ్యూహాలు రచించిన విధ్వంసానికి ముందుగానే బ్రేకులు వేసినట్టయింది.

ఈ రూట్‌లో సమీప భవిష్యత్‌లో చోటుచేసుకునే ఉగ్ర బీభత్సాన్ని అరికట్టడానికి ఈ ఎన్‌కౌంటర్ దోహదపడుతుందని, అందులో తాము మంచి విజయం సాధించినట్టేనని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఇందులో దీర్ఘకాలంగా యాక్టివ్‌లో ఉన్న ఓ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఉన్నాడని తెలిపారు. 

హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన చాన్నాళ్లుగా క్రియాశీలకంగా ఉన్న అశ్రఫ్ మోల్వీతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.