సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా అఖిలేష్ మాటలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్న మాయావతి తాజాగా కూడా ఆయనపై ఎదురుదాడికి దిగారు. సొంత కలను నెరవేర్చుకోలేని వ్యక్తి..ఇతరుల కలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. 

 బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి శుక్రవారం మరోసారి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ఎదురుదాడికి దిగారు. సీఎం కావాల‌నే త‌న సొంత క‌ల‌ను నేరవేర్చుకోలేని వ్య‌క్తి.. ఇత‌రులు ప్ర‌ధానమంత్రి కావాల‌నే కల‌ను ఎలా నెరవేరుస్తార‌ని ప్ర‌శ్నించారు. 

అఖిలేష్ యాద‌వ్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ తాజాగా మాయావ‌తి ట్వీట్ చేశారు. ‘‘ముస్లిం, యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్ల‌ను పూర్తిగా పొందేందుకు అనేక పార్టీల‌తో పొత్తు పెట్టుకుని, ఉత్తరప్రదేశ్ కు సీఎం కావాల‌నే కావాలనే తన కలను ఎస్పీ అధినేత నెరవేర్చుకోలేకపోయారు. అలాంటప్పుడు నేను ప్ర‌ధానిని కావాల‌నే క‌ల‌ను ఆయ‌న ఎలా సాకారాం చేయ‌గ‌ల‌రు. ’’ అని ఆమె హిందీలో ట్వీట్ చేశారు. 

2019లో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని బీఎస్పీ, ఎస్పీ పోటీ చేశాయి. తరువాత కాలంలో ఆ రెండు పార్టీలు విడిపోయాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విడి విడిగానే పోటీ చేశాయి. అయితే ఆ పార్టీ అధినేతల మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో మాటల యుద్ధం ముదిరింది. గ‌త బుధ‌వారం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ‘ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ తన ఓటును భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) బదిలీ చేసింది. మరి బీజేపీ మాయావతిని రాష్ట్రపతిని చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.’’ అని వ్యాఖ్యలు చేశారు. 

అఖిలేష్ యాదవ్ మాటలపై మాయావతి స్పందించారు. “ నేను నా జీవితంలో మళ్లీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కావాలని, భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రిని కావాలని కలలుకంటున్నాను. కానీ నేను రాష్ట్రపతిని కావాలని ఎందుకు క‌ల‌గంటాను. నేను నా జీవితాన్నిసౌకర్యవంతంగా గడపలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ చూపిన మార్గంలో నడిచాను. అణగారిన వర్గాలు వారి కాళ్లపై వాళ్లు నిలబడటానికి కృషి చేశాను. అయితే ఇలాంటి ప‌నులు రాష్ట్రపతి ప‌ద‌విని అధిరోహించ‌డం ద్వారా సాధ్యం కాద‌ని, యూపీ సీఎం అవ్వ‌డం ద్వారా లేక‌పోతే దేశ ప్రధానిగా ఎదగడం ద్వారానే జరుగుతుందని అందరికీ తెలుసు ’’ అంటా ఆమె ఎదురుదాడికి దిగారు

మాయావతి ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. తాను కూడా మాయావతి పీఎం కావాల‌ని కోరుకుంటున్నాని అన్నారు. అందుకే తమ పార్టీలు గతసారి (2019 సార్వత్రిక ఎన్నికల్లో) పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. ఆ పొత్తు కొనసాగితే బీఎస్పీ, అంబేడ్కర్ అనుచరులంద‌రూ ప్రధాని ఎవరు అవుతారో చూసేవారని యాదవ్ అన్నారు

అయితే ఈ వ్యాఖ్యల నేప‌థ్యంలోనే ఆమె శుక్ర‌వారం స్పందించారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ గత లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన పార్టీ తనను ప్రధానిని ఎలా చేస్తుందని మరో ట్వీట్ లో ప్రశ్నించారు. అందు వల్ల ఆయ‌న (అఖిలేష్ యాద‌వ్) ఇలాంటి బాల్య ప్రకటనలు చేయడం మానుకోవాలి అని ఆమె ఎద్దేవా చేశారు. కాగా ఇటీవ‌ల గ‌డిచిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ 111 స్థానాలు గెలుచుకోగా.. బీఎస్పీ కేవ‌లం ఒక్క స్థానానికే ప‌రిమితం అయ్యింది.