Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అఖిలేశ్ యాదవ్, మాయావతి డుమ్మా! కీలక యూపీలో కాంగ్రెస్ ఆశలు గల్లంతు?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష పార్టీల అధినేతలు పాల్గొనడం లేదని తెలుస్తున్నది. అఖిలేశ్ యాదవ్, మాయావతి, ఆర్ఎల్‌డీ చీఫ్ చౌదరిలు కాంగ్రెస్‌ యాత్రలో పాల్గొనడం లేదని సమాచారం. అందులో పాల్గొంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారాన్ని కలిగించడం ఇష్టం లేదని, కానీ, భారత్ జోడో ఐడియాను తాము గౌరవిస్తామని వివరించాయి.
 

akhilesh yadav, mayawati may not participate in rahul gandhis bharat jodo march
Author
First Published Dec 27, 2022, 12:54 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర వచ్చే నెల 3వ తేదీన ఘజియాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించబోతున్నది. ఈ సందర్భంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ విపక్షాలను ఈ యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. కానీ, రాహుల్ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొనబోవడం లేదనే సమాచారం అందింది. రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి కూడా స్కిప్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అఖిలేశ్ యాదవ్ పాల్గొనబోరని, అయితే, అతనికి బదులు వేరే నేతను ఈ యాత్రలో పాల్గొనడానికి పంపించే అవకాశాలు ఉన్నాయని ఎన్డీటీవీ ఓ కథనంలో పేర్కొంది. భారత్ జోడో యాత్ర ఐడియాను సమర్థిస్తున్నామని.. కానీ, ఆ యాత్రలో నేరుగా పాల్గొని కాంగ్రెస్‌తో పొత్తు గురించి కొత్త వదంతిని ప్రచారంలోకి తేవాలని భావించడం లేదని ఎస్పీ ప్రతినిధి ఘన్‌శ్యామ్ తివారి తెలిపారు.

ఆర్‌ఎల్డీ చీఫ్ చౌదరి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తనకు వేరే షెడ్యూల్స్ ఉన్నాయని, తాను కాంగ్రెస్ మార్చ్‌లో పాల్గొనబోవడం లేదని వివరించారు. ఈ యాత్రను ఆర్ఎల్డీ సపోర్ట్ చేస్తున్నదని, దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని అన్నారు. రాజస్తాన్‌లో తాము ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం నడుపుతున్నామని, భావజాలపరంగా తాము భారత్ జోడో యాత్రను సమర్థిస్తున్నామని వివరించారు. 

Also Read: భార‌త్ జోడో యాత్ర‌: కాంగ్రెస్ భారీ వ్యూహాలు.. యూపీ మాజీ సీఎంలు, సీనియ‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కు ఆహ్వానం

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కీలకమైన రాష్ట్రం. యూపీలో ఎంపీ స్థానాలు కేంద్రంలో అధికారాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ, ఇక్కడ కాంగ్రెస్ దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకు ముందటి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టి బరిలోకి దిగింది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ మెరుగైన ప్రదర్శన చూపించింది. కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీకి యూపీలో మంచి సీట్లు అవసరం. అవి నేరుగా అయినా... మద్దతుతో అయినా కాంగ్రెస్‌కు అవసరం. ఈ తరుణంలో ఎస్పీ, బీఎస్పీ చీఫ్‌లులో జోడో యాత్రలో నేరుగా పాల్గొనడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. 2024లో రాజకీయ పొత్తుపైనా ఈ యాత్రలో పాల్గొనడం కారణంగా అనేక విధాల చర్చ మొదలవుతుందని, కాంగ్రెస్ పార్టీకి డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలనే ఆలోచనలతోనే ఈ పార్టీల అధినేతలు భారత్ జోడో‌లో పాల్గొనడం లేదని చర్చ జరుగుతున్నది.

బీఎస్పీ చీఫ్ మాయావతి ఇటీవల కాంగ్రెస్ పై విమర్శనాత్మకంగా ఉంటున్నారు. 2022 ఎన్నికలకు ముందు క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయవద్దని మాయావతి బహిరంగంగా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లకు గండిపెట్టినట్టు అవుతుందని ప్రజలకు సూచించారు. ఇప్పుడు మాయావతి కాంగ్రెస్ యాత్రలో పాల్గొనకపోవడం ఆశ్చర్యమేమీ అనిపించదు. 

యూపీ ప్రతిపక్ష నేతలు ఈ యాత్రలో పాలుపంచుకోవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నిరాశ ఏర్పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios