అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే.. అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే  ఆయన త్వరలోనే ఎమ్మెల్యేగా రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కర్హల్ నియోజవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ శాసనమండలి సభ్యునిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. గత ఎన్నికలతో పోల్చితే మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ.. అధికారానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఇక, ఇప్పటికే ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అఖిలేష్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు రెండింటిలో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే అఖిలేష్ యాదవ్ ‌ఎంపీగా కొనసాగడానికే సిద్దంగా ఉన్నాడని సమాజ్‌వాదీ పార్టీ వర్గాల నుంచి సమాచారం. కొద్ది రోజుల్లో‌నే అఖిలేష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పక్షంలో.. శాసనసభలో ఆ పార్టీ పక్షనేతగా శివపాల్ యాదవ్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్ నేతు ఆజం ఖాన్‌ కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆజం ఖాన్.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచే విజయం సాధించారు. దీంతో ఆయన కూడా ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిందే. అయితే ఆజం ఖాన్‌ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇక, క్రిమినల్ ఇంటిమిడేషన్, భూ ఆక్రమణలు వంటి పలు ఆరోపణలపై ప్రస్తుతం ఆజం ఖాన్ సీతాపూర్ జైలులో ఉన్నారు.

ఇక, మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి SP Singh Baghelపై 67,504 ఓట్ల ఆధిక్యం సాధించారు. అఖిలేష్‌కు మొత్తం 1,48,196 ఓట్లు రాగా, బాఘెల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. ఎస్‌పీకి కంచుకోటగా చెప్పుకునే కర్హాల్‌లో అఖిలేష్‌కు 60.12 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈనెల 21న లక్నోలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.