ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గాయపడిన వ్యక్తిని కాపాడి తన మానవత్వాన్ని చాటుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న అఖిలేష్ యాదవ్ ఎయిర్ పోర్ట్ నుంచి కారులో ఇంటికి బయల్దేరారు. 

అర్జున్ గంజ్ మీదుగా వెడుతుంటే రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న ఓ యువకుడిని అఖిలేష్ యాదవ్ గమనించారు. వెంటనే తమ వాహనాన్ని ఆపించారు. కారులో నుంచి కిందకు దిగి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని రోడ్డు పక్కనున్న గట్టుపై కూర్చోబెట్టారు. అతని యోగక్షేమాలు కనుక్కుని, వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 

అయితే, బైక్ మీద వెడుతున్న ఆ యువకుడిని వెనక నుంచి ఓ వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిసింది. ఫలితంగా అతను రోడ్డుపై పడిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎస్పీ జాతీయ కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ ఒక ట్వీట్ లో తెలిపారు. అంతేకాదు అఖిలేష్ యాదవ్ మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారని.. రోడ్డుపై గాయాతో బాధపడుతున్న ఒక యువకుడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారని.. పేర్కొన్నారు.