కుల గణనకు కాంగ్రెస్ డిమాండ్ చేయడం మిరాకిల్: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ కౌంటర్

ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల నేతల మధ్య పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుల గణనకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ప్రశ్నించడం.. ఇండియా కూటమిలో భాగమైన ఆ రెండు పార్టీల మధ్య విభేదాలను తెరమీదకు తెచ్చింది.

Akhilesh Yadav Caste Census Swipe At Rahul Gandhi X Ray Widens INDIA Rift ksm

ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల నేతల మధ్య పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుల గణనకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ప్రశ్నించడం.. ఇండియా కూటమిలో భాగమైన ఆ రెండు పార్టీల మధ్య విభేదాలను తెరమీదకు తెచ్చింది.  అఖిలేష్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కుల గణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

గ‌త ప్ర‌భుత్వాలు త‌ప్పుడు విధానాల‌తో ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయింద‌న్నారు. కుల గ‌ణ‌న గురించి రాహుల్ గాంధీ చేసిన ఎక్స్-రే కామెంట్స్‌పై మండిపడ్డారు. ఇక, ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల గణనపై తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఈ చర్య  దేశంలోని వివిధ వర్గాల వివరాలను అందించే  ఎక్స్ రే అని పేర్కొన్నారు. 

రాహుల్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. కుల గణన కోసం కాంగ్రెస్ డిమాండ్ చేయడం ‘‘అద్భుతం’’ అని అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. ‘‘అప్పట్లో ఎక్స్ రే అవసరం ఉండింది.. ఇప్పుడు ఎంఆర్‌ఐ (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్‌లు ఉన్నాయి.. ఈ వ్యాధి ఇప్పుడు వ్యాపించింది. అప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం దొరికితే ఈ రోజు సమాజంలో ఇంత గ్యాప్ వచ్చేది కాదు’’  అని అఖిలేష్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ కూడా కుల గణన గురించి మాట్లాడటం అతిపెద్ద అద్భుతమని.. ఎక్స్‌రేల గురించి మాట్లాడుతున్న వారే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కుల గణనను నిలిపివేశారని అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్), శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీలు లోక్‌సభలో కుల గణణ డిమాండ్‌ను లేవనెత్తినప్పుడు.. కాంగ్రెస్ దానిని తిరస్కరించిందని అన్నారు. 

‘‘ఈరోజు కుల గణన ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే వారి సాంప్రదాయ ఓటు బ్యాంకు తమ వద్ద లేదని వారికి తెలుసు. కానీ వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారికి ద్రోహం జరిగిందని వారికి తెలుసు’’ అని అన్నారు. 

ఇక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంచుకోవడంపై కాంగ్రెస్, ఎస్పీ సంబంధాలు దెబ్బతిన్న తరువాత హస్తం పార్టీపై అఖిలేష్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ఇతర పార్టీలను ఫూల్స్ చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఉండవని ముందే చెబితే.. ఇండియా కూటమికి దూరంగా ఉండేవాళ్లమని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడంపై పునరాలోచిస్తామని చెప్పారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios