Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణికుల ఆదరణను చూరగొనేందుకు "ఆకాశ ఎయిర్" కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌యాణాల్లో వాటిని కూడా తీసుకెళ్తేందుకు అనుమతి

ఇటీవలే సేవలను ప్రారంభించిన భారత విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ప్రయాణికుల ఆదరణను చూరగొనేందుకు వీలుగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణీకులు తమ వెంట వారి పెంపుడు జంతువులు తీసుకెళ్లేందుకు అనుమతించాలని ఆకాశ ఎయిర్ నిర్ణయించింది. 

Akasa Air Indian Airline Will Allow Pet Dogs And Cats In Cabin From November
Author
First Published Oct 6, 2022, 10:49 PM IST

ఇటీవ‌ల విమానయాన‌ సేవ‌ల‌ను ప్రారంభించిన భారత విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణీకుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొనేలా వ్యూహాలు ర‌చిస్తుంది. జూలై 7న దేశంలో విమాన సేవలను ప్రారంభించిన ఈ సంస్థ జంతు ప్రేమికుల‌ను ఆక‌ట్ట‌కునే విధంగా తాజాగా చ‌ర్య‌లు తీసుకుంది.  ప్ర‌యాణీకులు తమ వెంట వారి పెంపుడు జంతువులు తీసుకెళ్లేందుకు అనుమతించాలని ఆకాశ ఎయిర్ నిర్ణయించింది. 

నవంబర్ నెల నుండి విమాన ప్రయాణ సమయంలో కస్టమర్లు త‌మ‌ పెంపుడు జంతువులను (కుక్కలు, పిల్లులు) తీసుకెళ్లడానికి అనుమతిస్తామని సంస్థ‌ తెలిపింది. నవంబర్ నుండి ప్రయాణికులు తమ పెంపుడు జంతువులతో కూడా ప్రయాణించవచ్చని అకాసా ఎయిర్ కోఫౌండర్ మరియు చీఫ్ మార్కెటింగ్  అధికారి బెల్సన్ కౌటిన్హో తెలిపారు. అక్టోబర్ 15 నుంచి దీనికి సంబంధించిన బుకింగ్స్ చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి విమాన సర్వీసుల్లో పెట్స్ ను తీసుకెళ్లేందుకు వీలుగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లకు సమ్మిళిత ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

రాకేశ్ ఝున్ ఝున్ వాలా ప్రమోట్ చేసిన విమానయాన సేవల సంస్థ ‘ఆకాశ ఎయిర్’ మూలధన పరంగానూ, 60 రోజుల పనితీరు సంతృప్తికరంగా ఉందని కంపెనీ CEO వినయ్ దూబే చెప్పారు. త‌మ సంస్థ‌ పనితీరు పట్ల తాము చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి ఆరు విమానాల కాన్వాయ్‌ ఉండగా, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 18కి చేరుతుందని తెలిపారు. ఎయిర్‌లైన్ దాని ప్రణాళిక ప్రకారంగా ట్రాక్‌లో ఉందని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పనితీరు సంతృప్తికరంగా ఉంది. విమానయాన సంస్థ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కూడా ఆర్డర్ చేసిందని తెలిపారు. ఆకాశ‌ ఎయిర్ ప్రస్తుతం రోజుకు 30 విమాన స‌ర్వీసుల‌ను నడుపుతోంది. తాజాగా శుక్రవారం నుంచి దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా తన సేవలను ప్రారంభించ‌నున్న‌ది.  
 
ఇప్ప‌టివ‌ర‌కూ విమానాల్లో ప్రయాణంలో పెంపుడు జంతుల‌ను ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా ఎయిర్ లైన్స్ అనుమతిస్తుండగా.. వీటి సరసన  ‘ఆకాశ ఎయిర్’  నిలవనుంది. అయితే.. ఇండిగో, ఎయిర్ ఏషియా సంస్థలు విమానాల్లో పెంపుడు జంతువుల‌ను తీసుకెళ్లడానికి అనుమ‌తించ‌డం లేదు..
 

Follow Us:
Download App:
  • android
  • ios