Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌‌లో పదవులకు ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా.. కారణమిదే..!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ కే అంటోని ఆ పార్టీలో తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. 

AK Antony son Anil k antony quits Congress a Day after opposing BBC series on PM Modi
Author
First Published Jan 25, 2023, 10:07 AM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ కే అంటోని ఆ పార్టీలో తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్‌‌లోని తన పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యూమెంటరీని అనిల్ అంటోని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే (బుధవారం) ఆయన కాంగ్రెస్‌లో పదవుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

సోషల్ మీడియాలో తన రాజీనామాకు సంబంధించిన వివరాలను వెల్లడించిన అనిల్.. ‘‘కాంగ్రెస్‌లో నా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. అసహనంతో ఒక ట్వీట్‌ను వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేశారు. అది కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పాటుపడే వారి నుంచి వచ్చింది. కానీ నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారు ఫేస్‌బుక్‌లో నాపై ద్వేషాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిని హిపోక్రసీ అంటారు. జీవితం సాగిపోతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. రాజీనామా లేఖగా పేర్కొంటూ ఓ లేఖను కూడా పోస్టు చేశారు.

‘‘నిన్నటి నుంచి  సంఘటనలను పరిశీలిస్తే.. నేను కేరళ పీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ సెల్ జాతీయ కో-ఆర్డినేటర్‌తో పాటు కాంగ్రెస్‌లో నా పాత్రలన్నింటినీ వదిలివేయడం సముచితమని నమ్ముతున్నాను. దయచేసి దీన్ని నా రాజీనామా లేఖగా పరిగణించండి.నేను ఇక్కడ ఉన్న  కొద్ది కాలంలో..  వివిధ సమయాల్లో హృదయపూర్వకంగా మద్దతిచ్చిన, మార్గనిర్దేశం చేసిన ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వానికి,  డాక్టర్ శశి థరూర్‌తో పాటు అసంఖ్యాక పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. 

 

 
అనేక విధాలుగా పార్టీకి చాలా సమర్థవంతంగా దోహదపడేలా చేయగలిగిన ప్రత్యేక బలాలు తనుకు ఉన్నాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అనిల్ పేర్కొన్నారు. ‘‘అయితే ఇప్పుడు నాకు ఒక విషయం బాగా తెలుసు.. మీ సహోద్యోగులు, నాయకత్వం చుట్టూ ఉన్న కోటీర్‌లు నిస్సందేహంగా మీరు చెప్పినట్టుగా చేసేవారి సమూహంతో పని చేయడానికి మాత్రమే ఆసక్తిని కలిగి ఉన్నారు. ఇది మెరిట్ ఏకైక ప్రమాణంగా మారింది’’ అంటూ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. తాను ఈ ప్రతికూలతకు గురికాకుండా తను ఇతర వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగించాలనుకుంటున్నానని చెప్పారు. 

అసలు అనిల్ ఏమన్నారంటే..
2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అనిల్ ఆంటోనీ వ్యతిరేకించారు. బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్, బ్రిటన్ మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా అభిప్రాయాలను సమర్థించే వారు భారతీయ సంస్థలపై ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సృష్టిస్తున్నారని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. అనిల్ ఇరాక్ యుద్ధం వెనుక జాక్ స్ట్రా మైండ్ ఉందని పేర్కొన్నారు. ‘‘మనకు అంతర్గత విభేదాలు ఉన్నా.. ఈ దేశంలో విభజనను సృష్టించడానికి బాహ్య ఏజెన్సీల ద్వారా దోపిడీ చేయనివ్వకూడదు’’ అని కూడా అన్నారు.

గుజరాత్ అల్లర్లపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టుగా కేరళ కాంగ్రెస్‌కు చెందిన వివిధ యూనిట్లు ప్రకటించిన తరుణంలో అనిల్ అంటోని  ఈ విధమైన కామెంట్స్ చేశారు. అయితే అనిల్ అంటోని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios