శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్ చేరడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా NCP పార్టీ, ఎన్నికల గుర్తు తన వద్దే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తానని ప్రకటించారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యమతున్న వేళ .. మహారాష్ట్ర ఎన్‌సీపీలో నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. శరద్ పవార్ పార్టీలో చీలిక జరిగింది. NCP నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన అజిత్ పవార్ (Ajit pawar) అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ మరో బాంబు పేల్చారు. ఎన్‌సీపీ పార్టీ, ఎన్నికల గుర్తు తన వద్దే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తానని ప్రకటించారు. తాము ఒక పార్టీగానే (NCP) మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే.. తమకు అన్ని వర్గాల బలం ఉందని, ఎమ్మెల్యేలందరూ తన వెంటే ఉన్నారని పవార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకే ప్రాధాన్యత ఇస్తారనీ, తన (ఎన్సీపీ) పార్టీకి 24 ఏళ్లు నిండాయనీ, యువ నాయకత్వం ముందుకు రావాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి సాగుతామని అన్నారు. దీంతో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ నిట్టనిలువుగా చీలిన సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. ఈ విధంగా అజిత్ పవార్ ఎన్సీపీపై దావా వేశారు.
దేశాభివృద్ధి కోసమే తమ పార్టీ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో భాగం కావాలని నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ నేత పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కూడా కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని అన్నారు. భారత దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందనీ, అందుకే తాము మహారాష్ట్ర ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతును అందించామని అన్నారు. 'ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంది. ఇతర దేశాల్లో ఆయనకు ఆదరణ ఉందనీ, అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారనీ, ఆయన నాయకత్వాన్ని అభినందిస్తున్నారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వారితో (బీజేపీ) కలిసి పోరాడతామని అజిత్ పవార్ ప్రకటించారు.
డిప్యూటీ సీఎంగా పవార్ ప్రమాణ స్వీకారం
అజిత్ పవార్ ఆదివారం నాడు శివసేన (ఏక్నాథ్ షిండే) శిబిరంలో చేరారు. అనంతరం.. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజబల్, దిలీప్ వాల్సే పాటిల్, ధనంజయ్ ముండే లున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ పదవిని తిరస్కరించడంపై అజిత్ అసంతృప్తిగా ఉన్నారని పుకార్లు వచ్చాయి. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ హాజరుతో జూలై 6వ తేదీన ఈ సమావేశం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. శరద్ పవార్ కూడా విలేకరుల సమావేశం నిర్వహించి, కొంతమంది పార్టీ అని చెప్పుకుంటున్నారని, అయితే అది ఎవరి పార్టీ అని ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ రెండు ప్రకటనలను బట్టి పార్టీపై పోరు తప్పదని స్పష్టమవుతోంది.
