నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఈరోజు అజిత్ పవార్‌తో పాటు, ఆయన నేతృత్వంలోని రెబల్స్ కలిశారు.  

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శరద్ పవార్‌‌కు వ్యతిరేకంగా అజిత్ పవార్‌ నేతృత్వంలో పలువురు నేతలు తిరుగుబాబు చేసిన సంగతి తెలిసిందే. వారు మహారాష్ట్రలోని అధికార ఎన్డీయే ప్రభుత్వంతో చేతులు కలుపగా.. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కొందరికి మంత్రి పదవులు కూడా లభించాయి. అయితే తాజాగా అజిత్ పవార్‌తో పాటు ఆయన నేతృత్వంలోని పలువురు ఎన్సీపీ నేతలు ఆదివారం ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో శరద్‌ పవార్‌ను కలిశారు. ఆ సమయంలోనే ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, పార్టీ నేత జితేంద్ర అవద్ కూడా వైబీ చవాన్ సెంటర్‌కు చేరుకున్నారు.

శరద్ పవార్‌ను కలిసిన వారిలో అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, మంత్రులు దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ఛగన్ భుజబల్, ధనంజయ్ ముండే, అదితి తట్కరే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తదితరులు ఉన్నారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ సమావేశం అనంతరం తిరుగుబాటుకు ముందు శరద్ పవార్ సన్నిహితులలో ఒకరిగా పేరున్న ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మేము మా దేవుడు, నాయకుడు శరద్ పవార్‌ను ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి కలిశాము. మేము ఎలాంటి అపాయింట్‌మెంట్ అడగకుండా ఇక్కడకు వచ్చాము. శరద్ పవార్ ఇక్కడకు ఒక మీటింగ్ కోసం వచ్చారని మాకు తెలిసింది. అందుకే మేమంతా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడకు వచ్చాము. శరద్ పవార్‌ను మేమంతా చాలా గౌరవిస్తాం. అయితే ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని.. ఆయన కూడా దీని గురించి సరిగ్గా ఆలోచించి భవిష్యత్తులో మాకు సహాయం చేయాలని అభ్యర్థించాం. శరద్ పవార్ మాకు సమాధానం ఇవ్వలేదు. ఆయన మేము చెప్పేది వింటూనే ఉన్నారు. ఆయనను కలిసిన తర్వాత మేము తిరిగి వెళ్తున్నాము. అయితే మా నేతలు రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో అజిత్ పవార్ నేతృత్వంలో పాల్గొంటాం’’ అని చెప్పారు. 

విపక్షాల భేటీకి ముందు మరో ట్విస్ట్?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడానికి పలు ప్రతిపక్షాలు పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు గత నెలలో పాట్నాలో సమావేశం కాగా.. తదుపరి సమావేశాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎన్సీపీ కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే ఈ సమావేశానికి ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ తర్వాత శరద్ పవార్ ఏ వైఖరి తీసుకుంటారు.. అసలు ఎన్సీపీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే అంశాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఇదిలా ఉంటే, అజిత్ పవార్ శుక్రవారం శరద్ పవార్ భార్య ప్రతిభా పవార్‌ను కలిశారు. ఇందుకోసం అజిత్ పవార్ అధికారిక నివాసం సిల్వర్ ఓక్‌ని సందర్శించారు. ప్రతిభా పవర్‌కు అజిత్ పవార్ సన్నిహితునిగా పేరు తెచ్చుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ సల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అతనిని తిరిగి ఎన్‌సీపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.