మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నేత, రాజ్యసభ ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. బీజేపీతో కలిసి అజిత్‌ పవార్‌ అధికారం పంచుకోవడం పై ఆయన నిప్పులు చెరిగారు. 

ఈ వ్యవహారం వెనుక​ శరద్‌ పవార్‌ హస్తం లేదని నమ్ముతున్నట్టు ప్రకటించారు. అజిత్‌ పవార్‌పై ముందు నుంచి అనుమానం ఉందని, ఈడీకి, కేసులకు భయపడే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చారని ఆయన చర్యను దుయ్యబట్టారు. 

శుక్రవారం తమతో జరిగిన సమావేశంలోనూ అజిత్‌ తీరు ఒకింత అనుమానం కలిగించిందన్నారు.శరద్‌ పవార్‌ను అజిత్‌ మోసం చేశారని, దొంగదెబ్బ తీశారని, మామకు వెన్నుపోటు పొడిచారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. అజిత్‌, ఆయన సంకనా చేరిన ఎమ్మెల్యేలందరూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ని, మహారాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని ఆక్షేపించారు. 

ధన బలంతో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుందని అభిప్రాయపడ్డారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌ పవార్‌ టచ్‌లోనే ఉన్నారని, ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడతారని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వివాదంలో శరద్‌ పవార్‌కు శివసేన తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా రౌత్ స్పష్టం చేశారు. 

ఇకపోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్రకు కావాల్సిం​ది సుస్థిరమైన ప్రభుత్వమని, ఇలాంటి ఖిచిడీ ప్రభుత్వం కాదని అన్నారు.  రాష్ట్ర ప్రజలు తమ బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన ప్లేటు ఫిరాయించిందని ఆయన ఆరోపించారు. 

ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నించడంతో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఎన్సీపీతో కలిసి సుస్థిర పాలన అందిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.