ఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం.. పరారీలో నిందితుడు.. ఏం జరిగిందంటే?
ఢిల్లీలో ఓ ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడితో ఆమెకు ఓ డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లు కలిసి జీవించారు. గొడవ జరిగి వేరుపడ్డారు. విడిగా ఉన్నప్పటికీ ఆమె వద్దకు వచ్చి నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం జరిగింది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి నిందితుడు ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ద్వారకా ఏరియాలో జనవరి 26వ తేదీన జరిగింది. బాధితురాలు ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళ.
నిందితుడితో తనకు పరిచయం ఉన్నట్టు బాధిత మహిళ తెలిపింది. వారిద్దరూ ఓ డేటింగ్ అప్లికేషన్‌లో కలుసుకున్నారని చెప్పింది. అతను మాజీ పైలట్ అని తనకు చెప్పాని పేర్కొంది. గతేడాది డిసెంబర్ నుంచి వారిద్దరూ కలిసి గుర్గావ్‌లో ఓ ఫ్లాట్ తీసుకుని జీవించారని వివరించింది. కానీ, వారిద్దరి మధ్య ఓ విషయమై వాగ్వాదం జరిగిందని తెలిపింది. అందుకే, తాను గుర్గావ్ ఫ్లాట్ వదిలిపెట్టి ద్వారకాకు షిఫ్ట్ అయ్యానని చెప్పింది.
‘జనవరి 26న నిందితుడు ఆ మహిళ ద్వారకాలో అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చాడు. అక్కడే ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు తన పై భౌతికంగానూ దాడి చేశాడని, ఈ విషయం ఎవరికి చెప్పినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని ఆమె తెలిపింది.
సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. ‘నిందితుడు పరారీలో ఉన్నాడు.తాము ఒక బృందంగా ఏర్పడ్డామని, అతడిని పట్టుకోవడానికి చర్యలు ప్రారంభించాం’ అని వివరించారు.
అంతేకాదు, నిందితుడి బ్యాక్ గ్రౌండ్‌నూ పరిశీలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నిజంగానే అతడు పైలటా? లేక బాధితురాలిని బురిడీ కొట్టించాడా? అనే విషయాన్నీ పరిశీలిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం అతను నిరుద్యోగి అని పేర్కొన్నారు.