Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్ హైజాక్ చేశారు.. విమానం జాప్యంపై చిరాకుతో ప్రయాణికుడి ట్వీట్.. పోలీసులు ఏం చేశారంటే?

విమానం జాప్యంపై చిరాకుతో ఓ ప్రయాణికుడు ఫ్లైట్ హైజాక్ అని ట్వీట్ చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని గుర్తించి ఫ్లైట్ నుంచి కిందికి దింపేశారు. ఆ తర్వాత కేసు పెట్టి అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి జైపూర్‌కు బయల్దేరిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీకి డైవర్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
 

air traveler arrested after he tweets flight hijack for delay
Author
First Published Jan 26, 2023, 11:55 PM IST

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి జైపూర్‌కు బయల్దేరిన ఫ్లైట్‌ను హైజాక్ చేశారు అని ఓ విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా జైపూర్‌కు వెళ్లాల్సిన విమనాన్ని ఢిల్లీకి మళ్లించారు. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిపేశారు. దీంతో చిరాకుతో ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఫ్లైట్‌ను హైజాక్ చేశారని ట్వీట్ చేశారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

రాజస్తాన్‌లోని నాగౌర్‌కు చెందిన మోతి సింగ్ రాథోడ్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. దుబాయ్ నుంచి జైపూర్‌కు బయల్దేరిన విమానంలో ఆయన వచ్చాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానాన్ని జైపూర్‌కు కాకుండా ఢిల్లీకి మళ్లించారని డీసీపీ (ఎయిర్‌పోర్టు) రవి కుమార్ సింగ్ తెలిపారు. 

ఆ ఫ్లైట్ ఉదయం 9.45 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగింది. మళ్లీ మధ్యాహ్నం 1.40 గంటలకు అది జైపూర్ వెళ్లడానికి క్లియరెన్స్ వచ్చింది. ఈ మధ్యలోనే ఫ్లైట్ ఆలస్యంపై చిర్రెత్తుకొచ్చి ప్రయాణికుడు మోతి సింగ్ రాథోడ్ ఫ్లైట్ హైజాక్ అని ట్వీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Also Read: మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని బహిరంగంగా స్క్రీనింగ్ వేసిన కాంగ్రెస్.. కేరళలోని బీచ్‌లో నిర్వహణ

పోలీసులు ఆ రాథోడ్‌ను తన బ్యాగ్‌తోపాటుగా ఫ్లైట్ నుంచి దింపేశారు. ఆ ఫ్లైట్‌లో అవసరమైన తనిఖీలు చేసి విమానాన్ని పంపించేశారు. రాథోడ్‌ను స్థానిక పోలీసులకు అప్పగించారు. 

ఫ్లైట్ ఇంకా టేకాఫ్ కావట్లేదనే ఫ్రస్ట్రేషన్‌తో తాను ఆ ట్వీట్ చేశానని రాథోడ్ పోలీసులకు వివరించాడని అధికారులు తెలిపారు. పోలీసులు మోతి సింగ్ రాథోడ్ పై కేసు నమోదు చేసి.. అతడిని అరెస్టు చేసినట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios