దేశంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. తమకు టీకాలు ఇవ్వకుంటే సేవలు ఆపేస్తామని ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ పైలట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఎయిర్ ఇండియా సిబ్బంది కోసం జాతీయ స్థాయిలో ప్రథమ ప్రాథాన్యంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని ఎయిర్ ఇండియాను కోరారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌కు ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) లేఖ రాసింది.

చాలా మంది విమాన సిబ్బంది ఇప్పటికే కోవిడ్ బారినపడ్డారని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని వెల్లడించింది.

Also Read:కరోనా సెకండ్ వేవ్ : ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి... !!

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారికి, డెస్క్‌లో ఉండి పనిచేస్తున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారని, కానీ విమాన సిబ్బందికి మాత్రం ఇప్పటి వరకు టీకా వేయలేదని ఐసీపీఏ ఆందోళన వ్యక్తం చేసింది.

విపత్కర పరిస్థితుల వేళ దేశానికి సేవ చేస్తున్న విమాన సిబ్బందిని, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందని తాము అనుకోవడం లేదన్నారు.  అయితే ఎయిరిండియా మేనేజ్‌మెంట్ తీరు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పటికైనా జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇవ్వాలని, లేదంటే విధులు బహిష్కరిస్తామని ఆ లేఖలో ఐసీపీఏ హెచ్చరించింది.