అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ విమానాన్ని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా సురక్షితంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోయింగ్ 777-300ఈఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో నడిచే విమానంలోని ఒక ఇంజన్‌లో ఆయిల్ లీక్ అయింది. దీంతో పైలట్ విమానాన్ని స్టాక్‌హోమ్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇక, విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను మోహరించారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
విమానం ఇంజిన్ ఒకదానిలో ఆయిల్ లీక్ అయినట్లు సీనియర్ డీజీసీఏ అధికారి తెలిపారు. ఆయిల్ లీక్ తర్వాత.. ఇంజిన్ మూసివేయబడిందని.. తరువాత విమానం స్టాక్‌హోమ్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని చెప్పారు. గ్రౌండ్ ఇన్‌స్పెక్షన్ సమయంలో.. ఇంజిన్ 2 డ్రెయిన్ మాస్ట్ నుంచి ఆయిల్ బయటకు రావడం కనిపించిందని తెలిపారు. పూర్తిస్థాయిలో తనిఖీ కొనసాగుతూ ఉందని చెప్పారు.
మరోవైపు అమెరికాలోని నెవార్క్ నుంచి బయలుదేరిన విమానాన్ని సాంకేతిక సమస్య కారణంగా స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే.. సోమవారం రోజున న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌కు మళ్లించిన సంగతి తెలిసిందే.
