ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ సిబ్బందికి నూతన మార్గదర్శకాలు వచ్చాయి. క్యాబిన్ క్రూ సిబ్బంది వీలైనంత తక్కువగా ఆభరణాలు ధరించాలని, అలాగే, డ్యూటీ ఫ్రీ షాపులకు వెళ్లరాదని ఆదేశాలు వచ్చాయి. విమాన ప్రయాణాల్లో ఆలస్యాన్ని నివారించడానికి సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. తద్వార సిబ్బంది సులువగా కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెక్స్ పూర్తవుతాయని, అక్కడి నుంచి నేరుగా బోర్డింగ్ గేట్ చేరుకోవాలని తెలిపింది.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థను టాటా సన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎయిర్‌లైన్స్(Airlines) సేవలను మెరుగు పరచడానికి ఆ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే విమాన ప్రయాణాల ఆలస్యాన్ని నివారించడానికి సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాబిన్ క్రూ సిబ్బంది ఆభరణాలు వీలైనంత తక్కువగా ధరించాలని(Minimal Jewellery) నూతన మార్గదర్శకాల్లో ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది. యూనిఫామ్ రెగ్యులేషన్స్(Uniform Regulations) తప్పకుండా పాటించాలని తెలిపింది. తద్వారా కస్టమ్స్, సెక్యూరిటీ చెక్స్ దగ్గర సమయం వృథాను అరికట్టవచ్చని తెలిపింది.
అలాగే, క్యాబిన్ క్రూ (Cabin Crew) సిబ్బంది డ్యూటీ ఫ్రీ షాపులను(Duty Free Shops) విజిట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్స్ ముగియగానే ఈ సిబ్బంది నేరుగా బోర్డింగ్ గేట్‌కు చేరుకోవాలని తెలిపింది. అలాగే, క్యాబిన్ సూపర్‌వైజర్ తప్పకుండా క్యాబిన్ సిబ్బంది అందరూ క్యాబిన్‌లో ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. విమానంలోకి గెస్టులు వస్తున్నప్పుడు లేదా అంతకు ముందే క్రూ సిబ్బంది కూల్ డ్రింక్స్ లేదా ఇతర బేవరేజెస్ తీసుకోరాదని, ఆహారం కూడా తినరాదని తెలిపింది. గెస్టులు స్వల్ప సమయంలోనే వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవడానికి సహకరించాలని వివరించింది.
ఫ్లైట్స్‌లోకి ఎక్కడానికి ముందు క్యాబిన్ క్రూ బాడీ మాస్ ఇండెక్స్, బరువు గురించి కచ్చితంగా చెక్ చేసే విధానాన్ని పాటించాలని ఇటీవలే ఎయిర్ ఇండియా ఓ అడ్వైజరీ తెచ్చింది. ఈ అడ్వైజరీకి ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ యూనియన్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. క్వార్టర్లీ బేసిస్ ఈ బాడీ మాస్ ఇండెక్స్, వెయిట్ చెక్స్ ఉంటాయని జనవరి 20వ తేదీన ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన పేర్కొంది. కానీ, ఈ నిబంధనలను సంస్థ క్యాబిన్ క్రూ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత టాటా తమ ఉద్యోగుల కోసం PF నియమాలు మార్చింది. ఈ మేరకు సంస్థను టేకోవర్ చేయడానికి ముందే జనవరి 13న ఎయిరిండియా చేత దరఖాస్తు చేయించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాల కోసం ఎయిర్ ఇండియాను చేర్చినట్లు గత నెలలో తెలిపింది .ఇప్పటివరకు 7,453 మంది ఉద్యోగులకు కంట్రిబ్యూషన్‌లు అందాయని ఈపీఎఫ్‌వో తెలిపింది.
డిసెంబరు నెలలో ఎయిర్ ఇండియా ఈపీఎఫ్‌వో సహకరించిన సుమారు 7,453 మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఇది కాకుండా, ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎయిర్ ఇండియా నిర్వహణ కోసం టాటా గ్రూప్‌కు రుణాలను అందజేస్తుంది. కన్సా ర్టియంలో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. కన్సార్టియం టాటా గ్రూప్‌కు టర్మ్ లోన్‌లతో పాటు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను అందిస్తుంది. Tata Group యొక్క అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ 8 అక్టోబర్ 2021న ఎయిర్ ఇండియాను 18000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
