ఉక్రెయిన్ సంక్షోభం (ukraine crisis) నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులను తరలించేందుకు కేంద్రం తీవ్రంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రొమానియా (romania) నుంచి 219 మంది విద్యార్ధులతో బయల్దేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ముంబైకి చేరుకుంది
ఉక్రెయిన్ సంక్షోభం (ukraine crisis) నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులను తరలించేందుకు కేంద్రం తీవ్రంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రొమానియా (romania) నుంచి 219 మంది విద్యార్ధులతో బయల్దేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ముంబైకి చేరుకుంది. ఆ విమానంలో 8 మంది ఏపీ విద్యార్ధులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
విమానంలో ఏపీ విద్యార్ధులు వీరే:
- పోతుల వెంకట లక్ష్మీధర్ రెడ్డి
- తెన్నేటి వెంకట సుమ
- అర్ఫాన్ అహ్మద్
- అమ్రితాంష్
- శ్వేతాశ్రీ
అంతకుముందు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు. భారతీయులను ఎయిర్ ఇండియా విమానంలో (airindia) స్వదేశానికి తీసుకొస్తున్న ఫొటోలను షేర్ చేసిన జైశంకర్.. ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరుల తరలింపుకు సంబంధించి పురోగతి సాధిస్తున్నామని చెప్పారు.
తమ బృందాలు 24 గంటలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయని.. తాను వ్యక్తిగతంగా భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. 219 మంది భారతీయ పౌరులతో రొమేనియా నుంచి ముంబైకి తొలి విమానం బయలుదేరిందని వెల్లడించారు. భారతీయుల తరలింపుకు సహకరించినందుకు రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి Bogdan Aurescuకు జైశంకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా.. బుకారెస్ట్‌కు, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌లకు మరిన్ని విమానాలను నడపనుంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం రొమేనియా, హంగేరియాలతో చర్చలు జరిపింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను వారి వెంట ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.ఇప్పటికే ఒక విమానం భారతీయులతో ఈరోజు అర్దరాత్రికి ముంబైకి చేరుకోనుండగా.. మరో విమానం రేపు ఉదయం ఢిల్లీకి చేరుకోనుందని సమాచారం.
ఇప్పటికే పలువురు భారత విద్యార్థులు రోడ్డు మార్గంలో ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న సంగతి తెలిసిందే. వారిని అక్కడి నుంచి బుకారెస్ట్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించనున్నారు. అయితే రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ నుంచి బుకారెస్ట్ దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.. రోడ్డు మార్గంలో ఈ దూరాన్ని చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది. మరోవైపు కైవ్ నుంచి హంగేరియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది.. దానిని రోడ్డు మార్గంలో కవర్ చేయడానికి 12-13 గంటలు పడుతుంది.
