జమ్మూకశ్మీర్ లో భారీ కుట్రకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జమ్ముకశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. పఠాన్ కోట్ తో సహా నాలుగు వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది.

8 నుంచి 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారని... వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి సిద్ధమవుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. అంతేకాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ లెవల్ ను జారీ చేశాయి. దీంతో శ్రీనగర్, అవంతిపురా, జమ్ము, పఠాన్ కోట్, హిందోవ్ స్థావరాల్లో భద్రతను మరింత పెంచారు.

ఉన్నతాధికారులు 24గంటల పర్యవేక్షణలో ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజనతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ దాడికి ప్రణాళికలు వేస్తున్నట్లు సైన్యాన్ని నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. సెప్టెంబర్ 25 నుంచి 30 మధ్యలో దాడులు జరగొచ్చని హెచ్చరించాయి. అంతేగాక 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ.. అంతకంటే పెద్దస్థాయిలో దాడులకు సిద్ధమవుతున్నారని అప్రమత్తం చేశాయి.