Asianet News TeluguAsianet News Telugu

UP Elections 2022: బీజేపీకి కలిసిరానున్న ఎంఐఎం.. ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఎస్పీకి సవాల్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి ఎంఐఎం కూడా బరిలోకి దిగుతుండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. లక్నోలోని సీసీమావు, ఆర్యనగర్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ నిర్ణయం అటు కాంగ్రెస్‌కు ఇటు సమాజ్‌వాదీ పార్టీకి రుచించడం లేదు. కాగా, ఎంఐఎం నిర్ణయం బీజేపీకి పరోక్షంగా లబ్ది చేకూర్చనుంది. ఈ రెండు స్థానాల్లో ముస్లిం సముదాయానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 
 

AIMIM contest in lucknow will benefit bjp in Uttar pradesh assembly elections
Author
New Delhi, First Published Jan 27, 2022, 6:20 PM IST

లక్నో: బీజేపీ(BJP), ఎంఐఎం(AIMIM)లు తరుచూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఈ రెండు పార్టీలు ఉప్పు.. నిప్పు అనేలా వ్యవహరిస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly Elections) రెండు స్థానాల్లో ఎంఐఎం.. బీజేపీకి పరోక్షంగా లబ్ది చేకూరుస్తున్నది. ఆ రెండు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు బరిలోకి దిగనుండటం అటు కాంగ్రెస్‌కు, ఇటు సమాజ్‌వాదీ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చ అవకాశాలు ఉన్నాయి. కానీ, బీజేపీకి మాత్రం లబ్ది చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లక్నోలోని రెండు స్థానాలు ఆర్యనగర్, సీసీమావు స్థానాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్టు వివరిస్తున్నారు. ఆ రెండు స్థానాల గురించి తెలుసుకుందాం.

లక్నో పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి ఆర్యనగర్, సీసీమావు, కైంట్‌లు ఉన్నాయి. ఇందులో ఆర్యనగర్, సీసీమావు నుంచి ఎంఐఎం అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరూ సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారే ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీ పార్టీ ఆ ఇద్దరినే బరిలోకి దించుతున్నది. కాగా, కాంగ్రెస్ తమ అభ్యర్థులనూ ఇక్కడ పోటీకి నిలుపుతున్నది. ఈ రెండు స్థానాల్లో ముస్లిం సముదాయానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎంఐఎం ఈ సారి పోటీలోకి దిగితే.. కచ్చితంగా గతంలో ఉన్న పరిస్థితులు మారి తీరుతాయని తెలుస్తున్నది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దెబ్బ తగులుతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఆధారపడ్డ ముస్లిం సముదాయం ఓట్లు ఎంఐఎంకు పడే అవకాశాలు ఉన్నాయి.

2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మోడీ వేవ్ ఉధృతంగా ఉన్నది. ఆ సమయంలో బీజేపీ ఎదురులేకుండా గెలుపును తమ ఖాతాలో వేసుకుంటూ వెళ్తింది. ఆ సమయంలో జరిగిన కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నోలోని ఆర్యనగర్, సీసీమావు స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఎందుకంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ జట్టుకట్టాయి. ఈ రెండు పార్టీలు పొత్తులోనే ఇద్దరు సమాజ్‌వాదీ అభ్యర్థులను ఈ రెండు స్థానాల్లో నిలబెట్టారు. అప్పుడు ఆ రెండు పార్టీలకూ ముస్లిం సముదాయం నుంచి మద్దతు ఆ అభ్యర్థులకు కలిసి వచ్చింది. దీంతో ఆ ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థులపై విజయం నమోదు చేసుకున్నారు.

కానీ, ఈ సారి ఆ పరిస్థితులు లేవు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఈ సారి వేర్వేరుగానే పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలకు మద్దతు ఉన్న ముస్లిం సముదాయం ఓట్లు చీలనున్నాయి. దీనికి తోడు, ఈ రెండు స్థానాల నుంచి ఈ సారి ఎంఐఎం బరిలోకి దిగుతున్నది. దీంతో.. ఆ రెండు పార్టీలకు దక్కే ముస్లిం ఓటు షేరునూ ఎంఐఎం మరింత కుదించేయనుంది. ఈ పరిణామాలు పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూర్చేలా ఉన్నాయని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఆ రెండు స్థానాల్లో బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు నామమాత్రమేనని పేర్కోంటున్నారు. అదిగాక, ఎంఐఎం బరిలోకి దిగనుండటంతో.. ముస్లిమేతర ఓట్లు ఎక్కువగా బీజేపీ వైపే మొగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ కచ్చితంగా బీజేపీకి కలిసివస్తుందని వివరిస్తున్నారు.

సిసిమావు నుంచి అల్లావుద్దీన్, ఆర్యనగర్ నుంచి దిల్దార్ గాజీలు ఎంఐఎం టికెట్‌పై బరిలోకి దిగుతున్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీసీమావు నుంచి ఇర్ఫాన్ సోలంకి, ఆర్యనగర్ నుంచి అమితాబ్ వాజపేయి పోటి చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios