శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహి ఈద్గా ట్రస్ట్ మధ్య తలెత్తిన వివాదం 1968లో పరిష్కారమైందని.. దీనిని మళ్లీ లేవనెత్తిన అవసరం లేదని అసదుద్దీన్ చెప్పారు.

ప్రార్థనా స్ధలాల చట్టం 1991 ప్రార్ధనా స్థలాల మార్పిడిని నిరోధిస్తుందని, ఈ చట్టం అమలు బాధ్యత హోంమంత్రిత్వ శాఖకు అప్పగించారని, దీనిపై కోర్టులో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని ఆయన ప్రశ్నించారు. 1968 అక్టోబర్‌లో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం పరిష్కారం కాగా మళ్లీ ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారని అసదుద్దీన్ నిలదీశారు.

కాగా మధుర సివిల్‌ కోర్టులో అడ్వకేట్‌ విష్ణు జైన్‌ ఈ వివాదాస్పద భూమి అంశంపై దావా వేశారు. సదరు భూమిలో ప్రతి అంగుళం శ్రీకృష్ణ భగవానుడి భక్తులకు, హిందువులకు పవిత్రమైనదని జైన్‌ పేర్కొన్నారు.

కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని, 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించాలని ఆయన కోరారు. షాహి ఈద్గా మసీదును తొలగించాలని జైన్ తన దావాలో పొందుపరిచారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు మధురలోని శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చివేశారని దావాలో ఆరోపించారు.