ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ గుజరాత్ పర్యటనలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నిప్పులు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చూపెట్టడానికి ఏమీ లేదని, అందుకే అది హిందూ, ముస్లిం వర్గాల మధ్య గొడవలనే ప్రధానం చేసుకుని మాట్లాడుతుందని ఆరోపించారు.
అహ్మదాబాద్: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ గుజరాత్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నిప్పులు కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన గుజరాత్‌లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చూపించుకోవడానికి ఏమీ లేదని, అందుకోసమే హిందు, ముస్లిం వర్గాల మధ్య దాడులను మళ్లీ తెర మీదకు తెస్తాయని అన్నారు.
అహ్మదాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ ముస్లింల గొడవలు మాత్రమే చూపిస్తాయని అన్నారు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ కొత్త డ్రామా మొదలు పెట్టాయని ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఢిల్లీలోని మదర్సాకు వెళ్లాడని వివరించారు. కాగా, అసోంలో మదర్సాలను కూల్చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌లో సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ దగ్గర చూపెట్టుకోవడానికి ఏమీ లేదని, వారు కేవలం హిందూ ముస్లింల మధ్య గొడవలను మాత్రమే చూపిస్తారని వివరించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాత ఢిల్లీలో ఆజాద్ మార్కెట్ మదర్సా తాజ్‌వీదుల్ ఖురాన్‌ను సెప్టెంబర్ 22న పర్యటించారు. అక్కడి పిల్లలతో సంభాషించారు. వారికి ఓ చిన్నపాటి సూచన కూడా ఇచ్చి వచ్చారు.
ఆల్ ఇండియా ముస్లిం ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ ఇల్యాసి మాట్లాడుతూ, మోహన్ భాగవత్ ఏకంగా జాతిపిత అని అనేశారు. అతిపెద్ద సోషల్ ఆర్గనైజేషన్‌కు హెడ్ అని పేర్కొన్నారు. మదర్సాల్లో ఏమి బోధిస్తారని పిల్లలను అడిగి తెలుసుకున్నారని వివరించారు.
