ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ విషయమై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. మిలిటరీ చీఫ్‌ల వెనుక దాక్కోవద్దని మోడీపై విమర్శలు చేశారు. ధైర్యంగా తమ నిర్ణయానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీపై ట్విట్టర్ వేదికగా దాడి చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీంను నిర్లక్ష్యంగా, ముందు చూపు లేకుండా తీసుకున్నదని మండిపడ్డారు.
ప్రధాని మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. మిలిటరీ చీఫ్‌ల వెనుక దాక్కోవద్దని ప్రధాని మోడీని అన్నారు. ఈ నిర్లక్ష్యపూరిత నిర్ణయానికి బాధ్యత తీసుకునే ధైర్యాన్ని చూపించండి అంటూ విమర్శించారు. అంతేకాదు, ఇందుకు బాధ్యత తీసుకుని తత్ఫలితంగా ఎదురయ్యే పరిణామాలనూ ఎదుర్కోండని పేర్కొన్నారు. ఈ దేశ యువత కోపం మీపైనేని, కేవలం మీపైనేనని ట్వీట్ చేశారు.
గురువారం కూడా ఆయన అగ్నిపథ్ స్కీం విషయమై ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక సంయమనం, వ్యవసాయ వ్యవస్థనుు నాశనం చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మీవైపు చూస్తున్నారని, కనీసం ఆర్మీపై అయినా దయ చూపండని ట్వీట్ చేశారు. అంటే.. ఆర్మీని అయినా నాశనం చేయకుండా ఆపండి అనే సారాంశంలో ఆ ట్వీట్ ఉన్నది.
