ఉదయాన్నే న్యూస్ పేపర్ చదువుతూ.. ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూసిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీకి  చెందిన సూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కనకరాజ్(67) ఈ రోజు కన్నుమూశారు. ఉదయం ఇంట్లో పేపర్ చదువుతూ ఒక్కసారిగా ఆయన కుప్పకూలారు. కాగా.. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కన్నుమూసినట్లు తెలిపారు. 

కాగా ఆయన మృతి పట్ల అన్నాడీఎంకే పార్టీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కనకరాజ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సూలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా.. 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు మృతిచెందారు. 

అంతకుముందు ఎమ్మెల్యేలు సీనివెల్‌, ఏకే బోస్‌, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కన్నుమూశారు. మరోవైపు కనకరాజ్‌ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీల సంఖ్య 22కు పెరిగింది. అంతకుముందు అన్నాడీఎంకేకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.