తమిళనాడులో అన్నాడీఎంకే మాజీ ఎంపీ భార్య దారుణహత్యకు గురయ్యారు. కన్నకొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు, రత్నం దంపతులకు సుధ, ప్రవీణ్ ఉన్నారు.

కుళందైవేలు నాలుగేళ్ల క్రితం మరణించగా.. కుమార్తె సుధ డాక్టర్‌గా స్ధిరపడి, మరో వైద్యుని వివాహం చేసుకుని ప్రస్తుతం తిరుప్పూరులో ఉంటోంది. కుమారుడు ప్రవీణ్ ఇంజనీరింగ్‌ను మధ్యలోనే ఆపేసి విదేశాలకు వెళ్లడంతో రత్నం చెన్నై బీసెంట్‌నగర్‌లోని బంగ్లాలో ఒంటరిగా జీవిస్తున్నారు.

ఈ క్రమంలో నెల రోజుల క్రితం ప్రవీణ్ ఒక యువతిని వెంటబెట్టుకుని తల్లి వద్దకు వచ్చాడు. ఆ యువతిని తాను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో రత్నం కొడుకుతో గొడవ పడింది. ఆనాటి నుంచి తనకు రావాల్సిన ఆస్తి పంచివ్వాల్సిందిగా తల్లిని వేధించసాగాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన కుమార్తెకు ఫోన్ చేసిన రత్నం.. తమ్ముడు తనతో ప్రవర్తించిన విధానాన్ని చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. దీంతో బీసెంట్‌నగర్‌లోని తన బంధువులకు సుధ ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సిందిగా కోరింది.

దీంతో బంధువులు రత్నం ఇంటికి వెళ్లగా.. తలుపులు మూసివున్నాయి. గుమ్మం దగ్గర రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో కంగారుపడిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూడగా రత్నం రక్తపు మడుగులో పడివుంది.

ఆమె నోట్లో కాగితాలు కుక్కి ఉండటంతో పాటు ప్లాస్టిక్ వైరుతో కాళ్లు, చేతులు కట్టేసి.. గొంతు, కడుపులో కత్తి గాయాలున్నాయి. రత్నం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ప్రవీణ్, అతని భార్యగా చెప్పిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లండన్‌లో ఉంటున్న ప్రవీణ్ అక్కడే ఓ యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పుల పాలుకావడంతో ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు.

నిందితుడు విదేశాలకు పారిపోకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ అలర్ట్ ప్రకటించారు. కాగా, రత్నం భర్త కుళందైవేలు 1991లో డీఎంకే తరపున తిరుచిన్‌కోడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.