తమిళనాడులో సంచలన సృష్టించిన కొడనాడ్ కేసులో తొలిసారిగా జయలలిత నెచ్చెలి వీకే శశికళను తమిళనాడు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొడనాడ్ ఎస్టేట్ ఆస్తుల గురించి, అందులోని భద్రపరిచిన డాక్యుమెంట్ల గురించి పోలీసులు ఆమెను అడగనున్నట్టు తెలిసింది.

చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొడనాడ్ కేసులో తొలిసారిగా ఏఐఏడీఎంకే మాజీ కార్యదర్శి, బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాడు పోలీసులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో టీ నగర్‌లోని ఆమె నివాసంలో వెస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్ సుధాకర్ సారథ్యంలోని పోలీసుల బృందం ఆమెను విచారించారు. నిలగిరి జిల్లా ఎస్పీ ఆశిశ్ రావత్, ఏడీఎస్పీ క్రిష్ణమూర్తి కూడా ఈ బృందంలో ఉన్నారు. కొడనాడ్ ఎస్టేట్‌లో భద్రపరిచిన డాక్యుమెంట్ల గురించి, ఆస్తులపై స్పష్టత కోసం పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.

తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణించిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నెచ్చెలి వీకే శశికళ జైలుకు వెళ్లిన ఈ కొన్ని వరుస నేరాలు జరిగాయి. అందుకు సంబంధించినదే ఈ కేసు. అప్పుడు అధికారంలో వీకే శశికళ అనుచరుడు(అప్పుడు) ఎడప్పాడి పళనిస్వామి ఉన్నాడు.

నిలగిరి జిల్లాలో జయలలిత, శశికళ, ఆమె బంధువులకు చెందిన సుమారు 900 ప్రైవేటు ఎస్టేట్ ఎస్టేట్ ఉన్నది. వీకే శశికళ జైలుకు వెళ్లిన తర్వాత 20177 ఏప్రిల్ 23న జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ సారథ్యంలో పది మందితో కూడిన ముఠా అక్రమంగా ఆ ఎస్టేట్‌లోకి జొరబడింది. కాపలాదారుడిగా ఉన్న గార్డు ఓం బహదూర్‌ను ఆ ముఠా హత్య చేసింది. కాగా, మరో గార్డు క్రిష్ణ తాపను కొట్టి కట్టేసింది. ఆ ఎస్టేట్‌లో కొన్ని డాక్యుమెంట్లను, ఇతర వస్తువలను దొంగిలించారు. 

కొడనాడ్ ఎస్టేట్‌లో డబ్బుల కట్టు పడిఉన్నాయని, వాటిని దోపిడీ చేద్దామని కనకరాజ్ ఇతరులతో కలిసి అందులోకి ఎంటర్ అయినట్టు చార్జిషీటు పేర్కొంటున్నది. కేరళకు చెందిన కేవీ సాయన్‌ను కన్విన్స్ చేసి కనకరాజ్ ఈ దోపిడీ, హత్యలకు తీసుకెళ్లాడని, ఆయనే ఈ కుట్ర చేసినట్టు తెలుపుతున్నది.

అయితే, అనూహ్యంగా ఈ దోపిడీ, హత్యలో పాలుపంచుకున్న ప్రధాన నిందితులు కనకరాజ్, కేవీ సాయన్ ఆ తర్వాత ‘ప్రమాదాల్లో’ మరణించారు. కొడనాడ్ ఎస్టేట్ దోపిడీ, హత్యలు జరిగిన ఐదు రోజుల తర్వాత కనకరాజ్ సేలం చెన్నై హైవేపై అత్తూర్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో కనకరాజ్ మరణించాడు.

అదే రోజు కేరళలో సాయన్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇందులో ఆయన భార్య, కూతురు మరణించగా, గాయాలతో సాయన్ బయటపడ్డాడు. 2017 జులై 3వ తేదీన కొడనాడ్ ఎస్టేట్ కంప్యూటర్ ఆపరేటర్ దినేశ్ కుమార్ కూడా ఆయన నివాసంలో మరణించి కనిపించాడు.

ఈ ఘటనలపై 2017 సెప్టెంబర్‌లో 11 మందిపై పోలీసులు 300 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో కేవలం కనకరాజ్ మాత్రమే తమిళనాడు వాసి. మిగతావారంతా కేరళకు చెందినవారు.

ఇదిలా ఉండగా, రెండో ప్రధాన నిందితుడు కేవీ సాయన్, మరో నిందితుడు మనోజ్ ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదేశాల మేరకే తాము కొడనాడ్ ఎస్టేట్‌లోకి ప్రవేశించామని, అక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను వెతికి తేవాల్సిందిగా ఆదేశించిన మేరకు తాము వెళ్లామని పేర్కొన్నారు.

కాగా, ముగ్గురు నిందితులు ఏకంగా కోర్టుకు ఎక్కి పళనిస్వామిని, శశికళ, అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఇన్‌చార్జీని కూడా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ దర్యాప్తు శశికళతో ముగిసిపోదని, రానున్న రోజుల్లో మరింత మందిని విచారిస్తామని తమిళనాడు పోలీసు వర్గాలు తెలిపాయి.