ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ప్రవర్తనతో విసుకు చెందిన హేమ అతడిని దూరం పెట్టింది. ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తాయి.
తనకు విడాకులు ఇచ్చి.. మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని కక్ష కట్టాడు. ఎలాగైనా ఆమె పగ తీర్చుకోవాలని అనుకొని.. అతి దారుణంగా 27సార్లు పొడిచి మరీ హత్య చేశాడు. ఈ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అహ్మదాబాద్ కి చెందిన అజయ్ ఠాకూర్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం హేమ అనే మహిళతో వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లు ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే కొన్నాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ప్రవర్తనతో విసుకు చెందిన హేమ అతడిని దూరం పెట్టింది. ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తాయి. ఇక ఇదే క్రమంలో.. హేమ తనకు పరిచయమైన మహేష్ ఠాకూర్ అనే యువకుడితో చేసిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. దీంతో హేమ తన భర్త అజయ్ ఠాకూర్‌కు విడాకులిచ్చింది.
అంతేకాక వారి ఇద్దరు పిల్లలని కూడా అజయ్ ఠాకూర్ వద్దే ఉంచింది. ఆ తర్వాత మహేష్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకుని అతనితోనే కలిసి ఉంటోంది. ఇక భార్య దూరమైనప్పటి నుంచి అజయ్ ఠాకూర్ మానసికంగా కుంగిపోయాడు. తన ఇద్దరు పిల్లలను భార్య వదిలి వెళ్లడంతో వారిని ఎలా చూసుకోవాలో తెలియక మదనపడుతూ మద్యానికి బానిసయ్యాడు. తనకు ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చిన భార్యపై పగ పెంచుకున్న అజయ్ ఠాకూర్ హేమను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం.. మాజీ భార్యను హత్య చేయాలని అనుకున్నాడు. ఆమె ఉంటున్న ఇంటి వెళ్లి ఆమెపై దాడికి యత్నించాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వెంటాడి మరీ కత్తితో 27సార్లు పొడిచి చంపేశాడు. ఆమె రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
