రేపు ఉదయం ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు ఈ ఐదు అసెంబ్లీల ఫలితాలు వెలువడుతుండగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పటికే రీసార్ట్ రాజకీయాలు షురూ అయ్యాయి. పార్టీ సీనియర్ నేతలూ సంప్రదింపుల్లో మునిగిపోయారు.
న్యూఢిల్లీ: రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడతాయి. ఈ ఫలితాల వెలువడానికి ముందే ఎగ్జిట్ పోల్స్ హల్‌చల్ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో వివిధ పార్టీల నేతలు హైరానా పడుతున్నారు. అధికారికంగా ఫలితాలు రేపు వెలువడే లోపు ఇల్లు చక్కదిద్దుకోవాలని ప్రయాస పడుతున్నారు. ఈ క్రమంలోనే ఫలితాలు వెలువడే లోపే తమ అభ్యర్థులు చేయి దాటిపోకుండా చూసుకోవడానికి రిసార్ట్ రాజకీయాలకు తెరతీశాయి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి క్యాండిడేట్లను తీసుకువెళ్లి దాచుకోవడానికి అక్కడి అధికారిక పార్టీలతో సంప్రదింపులు జరపడానికి సీనియర్ నేతలు పరుగులు పెడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో రెండు ఎగ్జిట్ పోల్స్ మినహా అన్నీ ఎగ్జిట్ పోల్స్ అధికారిక బీజేపీ గతం పోలిస్తే సీట్లను నష్టపోవచ్చు కానీ, మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని అంచనాలు వేశాయి. బీజేపీ 202 సీట్లను సులువుగా గెలుచుకుంటుందని పేర్కొన్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల్లో ఒకసారి అధికారాన్ని చేపట్టిన పార్టీ వెంటనే మళ్లీ అధికారాన్ని ఈ రాష్ట్రంలో పొందిన దాఖలా లేదు. ఏమో ఈ సారి మాత్రం బీజేపీ మళ్లీ యూపీ గద్దెను ఎక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీటైన క్యాంపెయిన్ చేసిన ఎస్పీ ఆర్ఎల్డీ 2017 కంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. కానీ, మెజార్టీ మార్క్‌ను అందుకోలేకపోవచ్చని, కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావచ్చని తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, మరో ప్రధాన రాష్ట్రం పంజాబ్‌లో కొత్త రికార్డులు నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీలు కాకుండా ఆప్ తిష్ట వేసేట్టు ఉన్నది. ఇదే జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్ మినహా ఒకటికి మించి వేరే రాష్ట్రంలో అధికారాన్ని వెలుగబెట్టిన పార్టీగా ఆప్ రికార్డు రాస్తుంది. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పడానికి భూమికను సిద్ధం చేసుకున్నట్టు అవుతుంది. 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తూ 117 సీట్లకు గాను 77 స్థానాలను కైవసం చేసుకుంది. అంతకుముందు అధికారంలో ఉన్న అకాలీ బీజేపీ కూటమి కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన ఆప్ అప్పుడు సెకండ్ ప్లేస్(22 సీట్లు)లో నిలిచింది.
పై రెండు రాష్ట్రాల్లో ఫలితాలపై ఒక అభిప్రాయం ఏర్పడుతున్నా.. ఉత్తరాఖండ్, గోవాల్లో మాత్రం ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాల్లేవని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో పార్టీలు ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. గోవాలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను రిసార్ట్‌కు తరలించింది. బాంబోలిమ్‌లోని హోటల్‌కు కాంగ్రెస్ అభ్యర్థులను తరలించింది. కాగా, గోవా సీఎం, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో చర్చించి వచ్చారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే స్థానిక పార్టీ జీఎంపీని మద్దతు కోసం సంప్రదించాయి.
ఇదే వ్యూహాన్ని ఉత్తరాఖండ్‌లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. తమ అభ్యర్థులను ప్రలోభాలకు లోనుకాకుండా చూడటానికి రాజస్తాన్‌కు తరలించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఇప్పటికే రాజస్తాన్ వెళ్లి సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 2016లో కాంగ్రెస్ నేతల్లోనే తిరుగుబాటుకు కారకుడిగా భావిస్తున్న బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ సీన్‌లోకి రావడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది.
కాగా, గోవా తరహాలోనే మణిపూర్‌లోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. రెండు స్థానిక పార్టీలు, స్వతంత్ర పార్టీలను చేరదీసి బీజేపీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈసారి మణిపూర్‌లో బీజేపీ సొంతంగా మెజార్టీ సీట్లు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
