భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాహుల్ సింగ్ ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకొన్నారు. దామో నియోజకవర్గానికి రాహుల్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందజేశారు.

ఎమ్మెల్యే రాజీనామాను అమోదిస్తున్నట్టుగా స్పీకర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ తో కలిసి తాను 14 నెలలు పనిచేశానని చెప్పారు. తన నియోజకవర్గంలో అన్ని ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయన్నారు. బీజేపీలో తన ఇష్టంతోనే చేరినట్టుగా ఆయన చెప్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం 87కి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో నారాయణ పటేల్, ప్రద్యం సింగ్ లోథి, సుమిత్రా దేవి కూడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనాామా చేసిన తర్వాత వారంతా బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 3వ తేదీన 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.