Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ కు ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ.. రేపే రెండో విడత పోలింగ్.. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ రేపు జరుగనున్నది. ఈ నేపథ్యం ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లి పాదాలకు నమస్కారం చేసి మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు.  ప్రధాని మోదీ రేపు అహ్మదాబాద్‌లో ఓటు వేయనున్నారు.  

Ahead Of Gujarat Polls Phase 2, PM Modi Seeks Blessings Of Mother Heeraben
Author
First Published Dec 4, 2022, 11:33 PM IST

ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే.. ఈ నానుడి సరిగా ప్రధాని మోడికి సెట్ అవుతోంది. ఆయన గుజరాత్ కు వచ్చిన ప్రతిసారి తన తల్లి హీరాబెన్ దగ్గరకు వచ్చి.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఆమె ఆశీర్వదం తీసుకుంటారు. తాజాగా  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ ఇంటి చేరుకున్నారు.  కొద్దిసేపు అమ్మతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు అడిగి  తెలుసుకున్నారు. అనంతరం తల్లి పాదాలకు నమస్కారం చేసి మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు తల్లితోనే ఉన్నారు. 


ప్రధాని మోదీ తన తల్లిని కలిసిన తర్వాత గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ నేతలతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు అంటే (డిసెంబర్ 5న) గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ లో  ప్రధాని మోడీ తన ఓటు హక్కును అహ్మదాబాద్‌లో వినియోగించుకోనున్నారు. 

అంతకుముందు .. ఆగస్టు నెలలో ప్రధాని మోడీ తన తల్లిని కలవడానికి తన నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో సబర్మతి నదిపై 'అటల్ బ్రిడ్జి'ని ప్రారంభించేందుకు ప్రధాని అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఖాదీ పండుగ కార్యక్రమానికి హాజరైన తర్వాత ప్రధాని మోదీ సాయంత్రం తన తల్లిని కలుసుకున్నారని, ఆమెతో అరగంట పాటు గడిపారని ఆయన తమ్ముడు పంకజ్ మోదీ చెప్పారు.
 
గుజరాత్‌లో జోరుగా ప్రచారం చేసిన ప్రధాని 

ఈ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పునరాగమనంపై ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మోదీ అనేక ర్యాలీలు, రోడ్ షోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండో దశ పోలింగ్ లో భాగంగా సోమవారం సెంట్రల్ గుజరాత్, ఉత్తర గుజరాత్ లలో ఓటింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 69 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 764 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు మొదటి దశ ఓటింగ్ డిసెంబర్ 1న జరిగింది. సగటున 63.31 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడత పోలింగ్ లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావటంతో రెండవ దశలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం నిర్వహించింది. ఈసారి బీజేపీకి కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. డిసెంబర్ 8న హిమాచల్ ఎన్నికలతో పాటు గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రముఖ్ స్వామి మహరాజ్ జన్మదిన శతాబ్ది ఉత్సవాలు

అహ్మదాబాద్‌లో ప్రముఖ స్వామి మహరాజ్ జయంతి ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ముప్పై రోజుల పండుగ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు నిర్వహించబడుతుంది. ఈ పండుగ కోసం అహ్మదాబాద్ పశ్చిమంగా ఉన్న సర్దార్ పటేల్ రింగ్ రోడ్డులో 600 ఎకరాల స్థలంలో 'ప్రముఖ్ స్వామి మహరాజ్ నగర్'ను నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు ఇక్కడ వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios