Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ ఉప ఎన్నికల తేదీ ప్రకటన వెలువడగానే పార్టీ మారిన బీజేపీ ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన రోజే బీజేపీ ఎమ్మెల్యే సౌమెన్ రాయ్ తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన మమతా బెనర్జీ ఈ ఉప ఎన్నికలో భాగంగా భవానీపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.
 

ahead of bypoll bjp mla soumen roy inducts into TMC
Author
Kolkata, First Published Sep 4, 2021, 5:32 PM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ఎన్నికల సంఘం బెంగాల్‌లో ఈ నెల 30న మూడు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించింది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ సహా సంసేర్‌గంజ్, జంగిపూర్‌లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. వీటితోపాటు ఒడిశాలోని పిప్లీ స్థానానికీ ఎన్నికల నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల తేదీ ప్రకటించడానికి ముందే భవానీపూర్‌లో దీదీకి ఓటేయాలని కటౌట్ వెలువడం గమనార్హం. ఇదిలా ఉండగా రాజకీయ పార్టీల ఫిరాయింపులూ ప్రారంభమయ్యాయి.

ఈసీ బెంగాల్‌లో ఉప ఎన్నికల తేదీ ప్రకటించినరోజు బీజేపీ నుంచి సౌమెన్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. కాలియాగంజ్ ఎమ్మెల్యే సౌమెన్ రాయ్ బెంగాల్, ఉత్తర బెంగాల్ అభివృద్ధి కోసం మళ్లీ తమ పార్టీలో చేరినట్టు టీఎంసీ నేత పార్థ చటర్జీ వెల్లడించారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వ సంపదను పరిరక్షించడానికి మళ్లీ టీఎంసీ గూటికే చేరారని తెలిపారు. సౌమెన్ రాయ్ బీజేపీ కంటే ముందు ఆయన టీఎంసీ నేతగా కొనసాగారు.

ఈ చేరికతో బీజేపీ బలం మరింత తగ్గిపోయింది. ప్రస్తుతం కమలదళం బలం 71గా ఉన్నది. ఇటీవలే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. 

పశ్చిమ బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన మమతా బెనర్జీ ఆమె పోటీ చేసిన నందిగ్రామ్‌లో పరాజయం పాలయ్యారు. అంతకు క్రితం ఆమె భవానీపూర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. సువేందు అధికారికి సవాల్ విసరడానికి ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. దీదీ ఎన్నిక కోసం తన సీటుకు రాజీనామా చేయడానికి సిద్ధమని భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే ఫలితాల వెంటనే ప్రకటించారు. తాజాగా, ఆ స్థానం నుంచి దీదీ ఉప ఎన్నికకు బరిలో దిగనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios