దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో అరెస్టయిన రాజీవ్ సక్సేనాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్ రాజీవ్ సక్సెనా కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.

యూఏఈ ప్రభుత్వం వీవీఐపీ, హెలికాఫ్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్ జాతీయుడు మైకెల్‌కు రాజీవ్ అత్యంత సన్నిహితుడు. రాజీవ్ సక్సెనా, ఆయన భార్య దుబాయ్‌లో గల తమ సంస్థల ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.

ఈ క్రమంలో 2017లో చెన్నై విమానాశ్రయంలో రాజీవో సక్సెనా సతీమణిని అరెస్ట్ చేశారు. తర్వాత యూఏఈ ప్రభుత్వ సహకారంతో సక్సెనాను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.

వీరిద్దరిపై మనీలాండరింగ్, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, ఫారిన్ కంట్రీబ్యూషన్ రెగ్యులేషన్ చట్టంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజీవ్ సక్సేనా ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ కేసును సోమవారం విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీ ఇవ్వాలని కోరారు. అలాగే సాక్షాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయొద్దని ఆదేశించారు. విచారణకు హాజరుకావాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.