అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాఫ్టర్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వానికి, ఎయిర్‌లైన్స్ సంస్థకు, ఇతర పెద్దలకు మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ జేమ్స్ మిచెల్‌ను దుబాయ్ భారత ప్రభుత్వానికి అప్పగించింది.

మంగళవారం రాత్రి ఆయన్ని దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్ జాతీయుడైన మైఖేల్ అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్‌‌ఫోర్స్‌మెంట్ 2016లో చార్జీషీటు దాఖలు చేసింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్‌తో చేతులు కలిపి హెలికాఫ్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైఖేల్ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ 2012లో ఆరోపించింది. ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబసభ్యులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని తెలిపింది..

విచారణ నుంచి తప్పించుకునేందుకు అతడు విదేశాలకు పారిపోయినట్లు సీబీఐ వెల్లడించింది. అతనిపై 2015లో నాన్-బెయిలబుల్ వారెంట్‌తో పాటు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆయనను 2017లో అరెస్ట్ చేశారు.

నాటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.. తనను భారత ప్రభుత్వానికి అప్పగించొద్దని అతను పెట్టుకున్న పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యేక పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ ఫలించి యూఏఈ ప్రభుత్వం మైఖేల్‌ను ఇండియాకి అప్పగించడానికి ముందుకొచ్చింది. 

కుంభకోణం ఎలా జరిగిందంటే:
దేశంలోని వీవీఐపీల ప్రయాణాల కోసం 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాఫ్టర్ కొనేందుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు అత్యున్నత వర్గాలకు అందాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ట నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో 2014 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలికాఫ్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించారని... అత్యున్నత స్థాయి అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది.

ఎత్తు తగ్గించడం వల్లే ఒప్పందం చేసుకోవడానికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ అర్హత సాధించిందని తెలిపింది. ఈ కుంభకోణం భారత్, ఇటలీల్లో సంచలనం కలిగించడంతో పాటు ఇరుదేశాల్లోని దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణలో పెద్దల పేర్లు బయటకు వచ్చాయి.

యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఒప్పందం కోసం భారతదేశంలోని రాజకీయ నాయకులు, అధికారులకు ముడుపులు చెల్లించామని.. ఎవరెవరికి ఎంతెంత చెల్లించామో కూడా ఇటలీలోని అధికారులు లేఖలతో సహా బయటపెట్టారు.

తాజాగా మైఖేల్‌ను భారత్‌కు రప్పించడంతో గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పవని బీజేపీ అభిప్రాపయపడింది. మైఖేల్ సీబీఐ కస్టడిలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తెలుస్తుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.