కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీ : రక్షణ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టి కొత్త స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌పై సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) హై అలర్ట్ ప్రకటించారు.
ఎక్కడ అల్లర్లు చెలరేగినా కఠినంగా వ్యవహరించాలని RPF సీనియర్ అధికారులు అన్ని యూనిట్లకు అంతర్గత కమ్యూనికేషన్ ప్రకటనను విడుదల చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని కఠినమైన సెక్షన్ల కింద అల్లర్లకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ పరికరాలు, సీసీటీవీల ద్వారా అల్లర్లు జరిగితే.. దానికి సంబంధించి డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులకు తెలిపారు.
వీడియో సాక్ష్యాధారాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుంటారు.పరిస్థితి అదుపు తప్పితే పోలీసు అధికారులు సరైన రక్షణ కవచాలు ధరించాలని, ముందుండి వారిని అదుపు చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.
బీహార్‌లోని 20 జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ జిల్లాల్లో కైమూర్, భోజ్‌పూర్, ఔరంగాబాద్, రోహతాస్, బక్సర్, నవాడా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సమస్తిపూర్, లఖిసరాయ్, బెగుసరాయ్, వైశాలి, సరన్, ముజఫర్‌పూర్, దర్భంగా, గయా, మధుబని, జెహానాబాద్, ఖగారియా, షేక్‌పురా ఉన్నాయి.
పంజాబ్ అంతటా భద్రత పెంపు...
భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో పంజాబ్ లో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పంజాబ్‌లోని అన్ని సైనిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. వాటి చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ పోలీస్ ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) కోరారు. అంతేకాదు అల్లర్లలో వీటికి ఎలాంటి హాని కలగకుండా రక్షించేందుకు ఆర్మీ అధికారులతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కూడా కోరారు.
బీజేపీ ఆఫీసుల్లో ‘అగ్నివీర్స్’ను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటాం - కైలాష్ విజయ వర్గియా
బిజెపి, హిందూ నాయకులను, వారి కార్యాలయాలకు కూడా రక్షణ కల్పించాలని.. ఎలాంటి దాడులు జరగకుండా చూడాలని పోలీసులకు తెలిపారు. షట్‌డౌన్ కాల్ గురించి పుకార్లు వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
UP నోయిడాలో CRPC 144...
యూపీలోని జిల్లాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించే సిఆర్‌పిసి సెక్షన్ 144ను విధించినట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను కోరారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న జెవార్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం జరిగిన హింసాత్మక నిరసనకు సంబంధించి ఇప్పటివరకు 225 మందిపై కేసులు నమోదు చేశారు. 15 మందిని అరెస్టు చేశారు.
7 రైళ్లు రద్దు.. మరో 10 రైళ్లు రీషెడ్యూల్...
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కొనసాగుతున్న నిరసనల మధ్య బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ నగరాల నుండి బయలుదేరే ఏడు రైళ్లను రైల్వే రద్దు చేసింది. బీహార్, బెంగాల్ నుండి బయలుదేరే మరో పది రైళ్లు కూడా రీషెడ్యూల్ అయ్యాయి. అలాగే, ఆ రాష్ట్రాల నుండి వచ్చే రెండు రైళ్ల మార్గాన్ని సోమవారం తగ్గించినట్లు తూర్పు రైల్వే తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయండి : పోలీసులకు బీహార్ సీఎస్
సోమవారంనాడు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపత్యంలో బీహార్ ప్రధాన కార్యదర్శి అమీర్ సుభానీ అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు, సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. అన్ని జిల్లాల అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. జార్ఖండ్‌లోని పాఠశాలలు సోమవారం పనిచేయవు. భారత్ బంద్ పిలుపు కారణంగా జార్ఖండ్‌లోని పాఠశాలలు సోమవారం సెలవు ప్రకటించామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలు కూడా రీషెడ్యూల్ చేశారు. "పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మేము కోరుకుంటున్నాము. బీహార్‌లో బస్సుకు నిప్పంటించడంతో విద్యార్థులను బలవంతంగా కిందకు దింపడం మేము చూశాం" అని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ ఆదివారం పిటిఐకి తెలిపారు.
